
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ కల్చరల్ : ప్రజావాణి వినతులను అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని జీడబ్ల్యూఏంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా బల్దియా కార్యాలయంలో కమిషనర్.. నగరవాసులనుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. ఇంజనీరింగ్ విభాగానికి 30, హెల్త్ అండ్ శానిటేషన్ 9, రెవెన్యూ10, టౌన్‌ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా5, హార్టికల్చర్ 2, విద్యుత్ 5 కలిపి మొత్తం 109ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
స్పాంజ్ పార్క్‌ల ఏర్పాటు తప్పనిసరి
పట్టణ ప్రాంతాల్లో స్పాంజ్ పార్క్‌ల ఏర్పాటు తప్పనిసరి అని సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరం నుంచి కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరై స్పాంజ్ పార్క్‌ల ఏర్పాటుకు గల అవకాశాలను తెలియజేశారు. నిర్దేశిత గడువులో ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు.
మొక్కలు నాటిన..
మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయ ఆవరణలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో సోమవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మేయర్ సుధారాణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణికి పలువురు కార్పొరేటర్లు, అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.