
రైతులను మోసం చేసిన ప్రభుత్వం
నయీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండలోని రోస్ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కౌలు రైతులను మర్చిపోయినందుకు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని 20 లక్షల మందికి వర్తింపజేస్తామని చెప్పారని, రాష్ట్రంలో కోటి మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయన్నారు.ఽ ధరణితో నష్టం జరిగిందని దుష్ప్రచారం చేసి తీసుకొచ్చిన భూ భారతి ఎక్కడా కనిపించడం లేదని, ధరణినే బాగుందని రైతులు అంటున్నారని కవిత పేర్కొన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిందన్నారు. వరంగల్ అభివృద్ధికి కేసీఆర్ మొదలుపెట్టిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా సీఎం రేవంత్రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ‘మాది రైతు కుటుంబం, మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసేవారు.. కేసీఆర్ కూడా స్వయానా రైతు.. అందుకే రైతు సమస్యలు తెలిసిన నేతగా కేసీఆర్ రైతుబంధు, బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టారు’ అని కవిత పేర్కొన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి సంస్థ కృషి చేస్తుందని వివరించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత