
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌లో తలెత్తిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఫిల్టర్‌బెడ్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోయిందనే సమాచారంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా మేయర్ తనిఖీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై అధికారులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. బల్దియా ద్వారా రెండు 500కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, డీఈ కార్తీక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేడు నీటి సరఫరా బంద్
వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్ ప్రాంతంలో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు కొనసాగుతున్నందున పలు ప్రాంతాలకు మంగళవారం నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట దర్గా, కాజీ పేట, ప్రశాంత్ నగర్, సుబేదారి ఎఫ్‌సీఐ కాలనీ, ప్రకాశ్‌రెడ్డి పేట, వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీ, టీవీ టవర్‌కాలనీ, గోపాల్‌పూర్, జవహర్ నగర్ కాలనీ, శాయంపేట అడ్వకేట్ కాలనీ, శ్రీనివాస కాలనీ, హంటర్ రోడ్డు, టీచర్స్ కాలనీ, కనకదుర్గ కాలనీ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు.