
బీఆర్‌ఎస్ పాపాలకు జీవితాంతం జైలులోనే
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన పాపాలు, అక్రమాలకు కేసులు పెడితే వారి జీవితం మొత్తం జైలులోనే ఉంటారని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మంలో కేటీఆర్ మాట్లాడిన భాషపై మండిపడ్డారు. సీఎం హోదాను విస్మరించి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన భాష అతని అహంకారానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ చదువుకున్న మూర్ఖుడిలా మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ ఓ బఫూన్ అన్నారు. దేశం విడిచివెళ్లిన విజయ్‌మాల్యా కంటే అతిప్రమాదకరమైన ఆర్థిక నేరస్తుడు కేటీఆర్ అని అన్నారు. నువ్వు , నీ అయ్య ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని, పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతాచారిలాంటి ఎందరో అమరుల త్యాగఫలితమే స్వరాష్టం వచ్చిందన్నారు. కేటీఆర్ (మైగేట్) శవాల నుంచి వచ్చే ఓ పురుగుగా అభివర్ణించారు. కేటీఆర్ అంతా దిగజారిన నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్ర అంటూ మరో డ్రామాకు తెరలేపాడని అన్నారు. ఎన్ని నాటకాలు వేసిన వర్ధన్నపేట, పాలకుర్తి ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.