
మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలి
● స్థానిక ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవ్వాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ: మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హసన్‌పర్తి మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, నూతన రేషన్ కార్డులను వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూ.10 లక్షల ప్రమాద బీమా, రూ.22 లక్షల రుణ బీమా, రూ.40.45 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ.7.76 కోట్ల వడ్డీ లేని రుణాలు, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మహిళలు ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ రేషన్‌కార్డులిస్తామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలచే ప్రదర్శించిన ఉత్పత్తులను కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి, సెర్ప్ డైరెక్టర్ నవీన్, వరంగల్ జెడ్పీ సీఈఓ రా మిరెడ్డి, హనుమకొండ డీఆర్డీఓ మేన శ్రీను, వరంగల్ డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.