రాజధాని పేరుతో ఎన్నికలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో ఎన్నికలకు బ్రేక్‌

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

ఏకపక్ష నిర్ణయాలు

సర్కార్‌ తీరుపై ప్రజాగ్రహం

తాడికొండ: రాజధాని పేరుతో ఏళ్లుగా ఆయా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. రాజధాని పూలింగ్‌కు ప్రభుత్వం 29 గ్రామాలను తీసుకుంది. వీటిలో 12 గ్రామాలు తుళ్ళూరు మండలంలో ఉన్నాయి. మంగళగిరిలో 5, తాడేపల్లిలో 2 గ్రామాలు ఉన్నాయి. అయితే మంగళగిరిలో 5 గ్రామాలు, తాడేపల్లిలో 2 గ్రామాలకు గతంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. తుళ్ళూరు మండలంలో 12 గ్రామాలతోపాటు మిగిలిన 3 గ్రామాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే తాజాగా రెండో విడత పూలింగ్‌లో తుళ్ళూరు మండలంలో 3 గ్రామాలు, అమరావతి మండలంలో 7 గ్రామాలు కలిపి మొత్తం 10 గ్రామాలకు సీఆర్‌డీఏ భూ సమీకరణ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఆ గ్రామాలను కూడా ప్రస్తుతం ఎన్నికలు నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అసలు నోటిఫికేషన్‌ ఇవ్వని తాడికొండ మండలంలోని 16 గ్రామాలతో పాటు మేడికొండూరు మండలంలో 4 గ్రామాలకు కూడా ఎన్నికలు నిలిపివేసినట్లు ప్రకటనలు వెలువడటం గందరగోళంగా మారింది. ఇదిలా ఉండగా తాడేపల్లి, మంగళగిరిని మహా నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసిన సమయంలో తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని 10 గ్రామాలు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో 12 గ్రామాలు కలిపారు. ప్రస్తుతం ఆ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సంకేతాలు వెలువడటంపై ఆందోళన చెందుతున్నారు.

పరమార్థం ఏంటో?

మంగళగిరి మున్సిపాలిటీ ఏర్పడి 1965లో ఎన్నికలు జరిగాయి. తాడేపల్లి మున్సిపాలిటీగా 2012లో ఏర్పడగా, 2014లో ఎన్నికలు జరిగాయి. అనంతరం 2021లో మంగళగిరి, తాడేపల్లి కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. ఆ తరువాత మొట్టమొదటి ఎన్నికలు ఇవి. అయితే మొదటి దశ పూలింగ్‌కు ఇచ్చిన 29 గ్రామాలైన తాడేపల్లి రూరల్‌లో ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి రూరల్‌లో యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లు గ్రామాలను మంగళగిరి– తాడేపల్లి కార్పోరేషన్‌లో కలిపారు. ఆ గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా మిగిలిన మొదటి దశ పూలింగ్‌ జరిగిన 22 గ్రామాలు, రెండో దశలో ప్రకటించిన 10 గ్రామాలు, అసలు పూలింగ్‌ ప్రకటించని తాడికొండ మండలంలో 16 గ్రామాలు, మేడికొండూరు మండలంలో 5 గ్రామాలకు ఎన్నికలు ఎందుకు నిలిపివేశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పేరుతో భవిష్యత్తులో కూడా పూలింగ్‌ ఉంటుందంటూ మంత్రి నారాయణ చేస్తున్న వ్యాఖ్యలపై ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఎన్నికలు నిర్వహిస్తే రైతులు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించి, అధికార పార్టీని తరిమికొట్టడం ఖాయమని గ్రహించిన ప్రభుత్వం ఇలా ఎన్నికల ప్రక్రియ నిలిపివేసేందుకు మొగ్గు చూపడం అవివేకమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, సీఆర్డీఏ, మంత్రి నారాయణ ఏకపక్ష వైఖరిపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతు జేఏసీ నాయకులు.. ఏకంగా పూలింగ్‌కు ఇచ్చి తాము తప్పుచేశామని బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన వ్యవస్థ రాజధాని ప్రాంతంలో గత 12 సంవత్సరాలుగా లేకపోవడమే అనేది బహిరంగ రహస్యమే అని పలువురు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కులను పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు తప్పనిసరి అని, ప్రభుత్వం దానిని తమకు దూరం చేసి సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని పలువురు హితవు పలుకుతున్నారు. మరికొందరు దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఆయా గ్రామాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ అసంబద్ధ, అనైతిక నిర్ణయాలతో రైతులు, సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఆర్‌డీఏ పేరుతో సీఎం చైర్మన్‌గా ఉండి మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధానిలో మంత్రి వర్గ నిర్ణయాలకు పెద్దపీట వేస్తూ ఇష్టారీతిగా పనులు నిర్వహిస్తున్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో బడా సంస్థలు, బడా బాబులకు చౌక ధరలకు భూములు కట్టబెట్టడం, గ్రామాల అభివృద్దిని గాలికొదిలేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి పప్పు బెల్లాల్లా నిధులు పంచుకోవడం పరిపాటిగా మారింది. అదే ఆయా గ్రామాల్లో కార్పొరేషన్‌గానో లేక, మహా నగరపాలక సంస్థగానో ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటే స్థానిక ప్రయోజనాలకు పెద్దపీట వేసేవారు. అదేమీ లేకుండా ప్రభుత్వమే ఓ సంస్థను ఏర్పాటు చేసి అడ్డగోలుగా తీసుకుంటున్న నిర్ణయాలపై రాజధాని ప్రాంత వాసులు, భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి అధికారిక పూలింగ్‌

ప్రకటన లేకుండానే తాడికొండ

మండలంలో నిలిపివేత

‘స్థానిక’ ప్రజాప్రతినిధులు లేకుండా

ప్రభుత్వమే నిర్ణయాలు

తీసుకోవడంతో రైతులకు కష్టాలు

అధికారులకు సైతం అంతుపట్టని

టీడీపీ సర్కారు వైఖరితో

రాజధాని వాసుల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement