మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఎయిమ్స్లో ప్రపంచ శరీర నిర్మాణ శాస్త్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వైద్య విద్య, పరిశోధనలకు అమూల్యమైన సేవలందిస్తున్న స్వచ్ఛంద దేహదాతలకు నివాళులర్పించారు. దేహదాన ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు దాత కుటుంబాలను సత్కరించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వి.సుభద్రదేవి వైద్య విద్యలో శరీర నిర్మాణ శాస్త్రం ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. ఎంబీబీఎస్, అనుబంధ ఆరోగ్య శాస్త్రాలు, నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛంద దేహదాతల సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దేహదాన స్మారక గోడను ప్రారంభించారు. ఎనిమిది మంది దేహదాతల కుటుంబాలను సత్కరించగా, దేహదానానికి ముందుకొచ్చిన 30 మంది భావి దాతలను గౌరవించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యూట్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతేం శాంతాసింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ మోహన్, డీన్ అకాడమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ దేశురామ్ మోహన్, డీన్ రీసెర్చ్, ప్రొఫెసర్ డాక్టర్ జాయ్ ఎ.ఘోషల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


