● ప్రియాంబుల్ కాపీ లీకేజీపై
కలెక్టర్ ఆగ్రహం
● కౌన్సిల్ క్లర్క్ నాగరాజు సస్పెన్షన్..
సిటీ ప్లానర్కు షోకాజ్ నోటీసు
● టౌన్ ప్లానింగ్ వారి పాత్రపైనా
సమగ్ర విచారణ
నెహ్రూనగర్: వార్డుల రిజర్వేషన్ల జాబితా (ప్రియాంబుల్ కాపీ) లీకేజీ వ్యవహారంలో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం నగరపాలక సంస్థ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అధికారికంగా విడుదల కావాల్సిన జాబితాను కొందరు కింది స్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో టీడీపీ నేతలకు, అనుకూల మీడియాకు వాట్సాప్ ద్వారా లీక్ చేయడంపై గురువారం ‘సాక్షి’లో ‘అధికారుల పచ్చపాతం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ మయూర్ అశోక్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. లీకేజీకి బాధ్యులెవరనే దానిపై ప్రాథమిక విచారణ జరిపి, కౌన్సిల్ గుమస్తా అడపా నాగరాజును సస్పెండ్ చేస్తూ కమిషనర్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ రాంబాబుకు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో కౌన్సిల్ గుమస్తాపై మాత్రమే చర్యలు తీసుకుని, టౌన్న్ ప్లానింగ్ సిబ్బందిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వార్డుల పునర్విభజన నుంచి రిజర్వేషన్ల రూపకల్పన వరకు టౌనన్ ప్లానింగ్ విభాగమే కీలకంగా వ్యవహరించింది. ఈ విభాగంలోని కొంత మంది అధికారులు, కింది స్థాయి సిబ్బంది టీడీపీ నేతలతో కుమ్మకై సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అత్యంత గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


