నెహ్రూనగర్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన భీమవరపు శివకోటిరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తెనాలి నియోజకవర్గానికి చెందిన ధరణికోట మల్లికార్జునరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన దొడ్డ రమేష్‌బాబు, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర సెక్రటరీగా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వట్టిప్రోలు రంగారావు, రాష్ట్ర గవర్నెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన షేక్‌బాజీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడిగా దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
నగరంపాలెం: డీఎస్పీ మురళీకృష్ణ గత రెండేళ్లకుపైగా మంగళగిరి ఉత్తర సబ్ డివిజన్ పరిధిలో సమర్థవంతంగా విధులు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఉత్తర సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ బదిలీపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వెళ్తున్న సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన్ను సత్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సెన్సిటివ్ సబ్ డివిజన్‌లో అందరి సమన్వయంతో విధులు చేపట్టి, ఎటువంటి రిమార్కులు లేకుండా పనిచేశారని ప్రశంసించారు. డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ 1991 బ్యాచ్ ఎస్‌ఐగా పోలీస్ శాఖలో చేరానన్నారు. 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేశానని తెలిపారు. తాడేపల్లి పీఎస్ సీఐ సురేంద్రబాబు, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని సీఈడీఎం కార్యాలయంలో హజ్ 2027కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి తాత్కాలికంగా అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఎంపికై న సేవా సహాయకులకు ముఖాముఖి పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు హాజీ షేక్ హసన్ బాష, ఈఓ అబ్దుల్ ఖాదర్‌లు మాట్లాడుతూ మార్కుల ఆధారంగా సెంట్రల్ హజ్ కమిటీఆఫ్ ఇండియా 19 మందిని ఎంపిక చేస్తుందని తెలిపారు. భారత్ హజ్ కమిటీ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మైనార్టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్, వక్ఫ్ బోర్డు సీఈవో యాకుబ్ బాషాలు మాట్లాడుతూ హజ్ సేవకులు సేవా దృక్పధంతో పనిచేయాలని, ప్రభుత్వ అధికారిగా కాకుండా సేవకుడిగా యాత్రలో పనిచేయాలని సూచించారు. ఇస్లాం ధర్మంలోని ఐదు మూల స్తంభాల్లో హజ్ ఒకటి అని, ఆర్థికంగా, శారీరకంగా స్థోమత ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన పవిత్ర యాత్రఅని పేర్కొన్నారు. విజయవాడను అధికారిక ఎంబార్కేషన్ కేంద్రంగా ఆమోదించిందని వివరించారు. హజ్ కమిటీ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, మన్సూర్ అలీఖాన్, షేక్ హుస్సేన్, షేక్ ఆబిద్, హజ్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాడికొండ: తుళ్ళూరు మండలం మందడం సీడ్ యాక్సిస్ రోడ్డుపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. అత్తలూరు గ్రామానికి చెందిన కోట కళ్యాణ్ రావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై సీడ్ యాక్సిస్ రోడ్డుపై వస్తుండగా బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న హైడ్రాలిక్ వాహనం కిందకు దూసుకెళ్లడంతో దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అదుపు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో పారా మెడికల్ కోర్సుల్లో చేరేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు మెడికల్ కాలేజీలో డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డిప్లమో ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లోమో ఇన్ ఐసీజీ టెక్నీషియన్, రేడియగ్రాఫిక్ అసిస్టెంట్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఫెర్‌ఫ్యూజన్ టెక్నీషియన్, ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సుల్లో 105 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్, బైపీసీ, తత్సమాన కోర్సు చదివిన వారు అర్హులని, రెండేళ్ల కాలపరిమితితో కోర్సు ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈనెల 14వ తేదీలోపు అందజేయాలన్నారు.దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ఏపీఎస్‌ఏహెచ్‌పీసీ.కో.ఇన్ వెబ్‌సైట్ చూడాలని డాక్టర్ సుందరాచారి వెల్లడించారు.


