సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ దశలోనే అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అంబటి ఆరోపించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మాట్లాడుతూ.. తహసీల్దార్లకు ఫోన్ చేసి ధ్రువపత్రాలు ఇవ్వొద్దని చెప్పే స్థాయికి చంద్రబాబు, లోకేశ్ దిగజారారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశామని, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గణనీయంగా పెరిగింది. అలాగే, వైఎస్సార్‌సీపీ ప్రజాదరణ పెరుగుతోంది. నిజాయితీగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లు తిరస్కరిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అలాగే, తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ నిర్మాణం కోసం తమ ప్రభుత్వ హయాంలో రెండెకరాల భూమిని కేటాయించామని అంబటి తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తయ్యే దశలో భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. కోర్టు నోటీసు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ వాటిని పట్టించుకోలేదని అన్నారు. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీసు ఇచ్చారని, స్మశానవాటిక కోసం భూమిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు నివాసానికి అనుమతులు లేవని తాము ఆరోపిస్తున్నప్పటికీ, ఆయన కోర్టును ఆశ్రయించి ఇంటి కూల్చివేతను అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అంశంపైనా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం?


