గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. సాయి కల్యాణ చక్రవర్తి సూచనలతో గురువారం వివాహ సమస్యలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో అవగాహన సదస్సు నిర్వహించారు. సామాజిక సంక్షేమం, కట్నంతో అనర్థాలు, లింగ సమానత, రాజ్యాంగ నియమాలు, మహిళల హక్కులు, మధ్యవర్తిత్వం, వివాహ సంబంధిత వివాదాల పరిష్కారంపై నిర్వహించిన సదస్సులో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్ పి.వి. రాజీవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కోసం వన్ కే వాక్‌ను నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి మెడికల్ కాలేజీ రోడ్ మీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి జిల్లా కోర్టు మీదుగా తిరిగి సంస్థ వద్ద వాక్ ముగిసింది. పి.వి. రాజీవ్ మాట్లాడుతూ మన చట్టాలు, న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ మహిళలకు జరిగే అన్యాయాలను అరికట్టలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
అందరిలో మార్పు ముఖ్యం
మార్పు అనేది ముందుగా ప్రతి వ్యక్తిలో రావాలన్నారు. సీ్త్ర, పురుషులిద్దరూ సమానమేనని తెలిపారు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలన్నారు. పిల్లలను గమనిస్తూ జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుందని, కొన్ని కుటుంబాలు మారితే సమాజం బాగుంటుందని అన్నారు. మార్పు ముందు మన ఆలోచనల్లో రావాలన్నారు. రాజ్యాంగం, చట్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించి నూతన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు.
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ బాలలు, మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కట్ట కాళిదాసు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా స్టేక్‌హోల్డర్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్, పారా లీగల్ వలంటీర్స్, ప్యానెల్ అడ్వకేట్లు, సచివాలయ సిబ్బంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


