అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

మంగళగిరి టౌన్‌: యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఆమె నుంచి నగదు కాజేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు మంగళగిరి పట్టణ సీఐ కె. వీరాస్వామి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన బాధితురాలు సింగర్‌, యాంకర్‌గా ఆర్కెస్ట్రా కార్యక్రమాలకు వెళుతుంటారు. మంగళగిరికి చెందిన షేక్‌ జాని అలియాస్‌ సిద్దిక్‌ విజయవాడలో పెట్‌ షాపు నిర్వహిస్తున్నాడు. సుమారు మూడు నెలల క్రితం ఆమెకు ఫోన్‌ చేసి, తన దుకాణం ప్రచారం కోసం రీల్స్‌ చేస్తే రూ.30 వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో ఆమె అంగీకరించారు. ఆ క్రమంలో సెప్టెంబర్‌ 20వ తేదీన విజయవాడకు వస్తున్నానని ఆమె ఫోన్‌ చేయగా, మంగళగిరిలోని ఓ లాడ్జిలోని గదికి వచ్చి ఫ్రెష్‌ అప్‌ కావాలని నిందితుడు సూచించాడు. ఆమె అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే గదిలోకి వచ్చి మాట్లాడాడు. అనంతరం నీళ్లు తాగమని ఇవ్వగా, తాగిన కొద్దిసేపటికే ఆమెకు మత్తుగా అనిపించి స్పృహ కోల్పోయారు. వెంటనే ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానంటూ బెదిరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బెదిరించి రూ.15,800 ఫోన్‌పే చేయించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించారు. బాధితురాలిని గదిలోనే ఉంచి బయట నుంచి తాళం వేసి నిందితుడు వెళ్లిపోయాడు. మరుసటి రోజు బాధితురాలు అక్కడి నుంచి బయటపడి కడపకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, మంగళగిరి టౌన్‌ పోలీసులకు బదిలీ చేసినట్లు సీఐ వివరించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షేక్‌ జాని అలియాస్‌ సిద్దిక్‌ను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు, నార్త్‌ డీఎస్పీ పర్యవేక్షణలో తన ఆధ్వర్యంలో ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌, పోలీసు సిబ్బంది బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement