సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు, రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవికి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ సంస్థ ఈ నెల 21న తెలంగాణలోని సారస్వత్ పరిషత్ భవన్‌లో పలువురు ప్రముఖులు చేతులు మీదుగా ఇంటర్నేషనల్ బంగారు తల్లి అవార్డును ప్రదానం చేసింది. రమాదేవి సాహిత్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుతోపాటు మెమోంటో, సర్టిఫికెట్, కిరీటం ఇచ్చి సత్క రించారు. డాక్టర్ సరికొండ రమాదేవిని సత్తెనపల్లిలోని వివిధ కళా సంస్థల బాధ్యులు, సాహితీ ప్రియులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన బీఈడీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, బీ–ఫార్మసీ, ఫార్మా డీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బీఈడీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 6162 మంది హాజరు కాగా వారిలో 5631 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు జులై 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను జులై 7వ తేదీలోగా పీజీ పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బీ–ఫార్మసీ నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 365 మంది హాజరు కాగా వారిలో 219 మంది, ఏప్రిల్‌లో జరిగిన బీ–ఫార్మసీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 283 మంది హాజరు కాగా వారిలో 174 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్‌లో జరిగిన ఫార్మా డీ 3వ సంవత్సరం పరీక్షలకు 299 మంది హాజరు కాగా వారిలో 276 మంది, మార్చి నెలలో జరిగిన ఫార్మా డీ నాల్గవ సంవత్సరం పరీక్షలకు 277 మంది హాజరు కాగా వారిలో 255 మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
నెహ్రూనగర్ : ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా హాజరై సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల కార్మికుల ఉపాధి, ప్రజారవాణా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు మురళి, పత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షుడు బాబు, గుంటూరు కోఆర్డినేటర్ సింగూ నరసింహారావు, పోకల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం సార్వత్రిక దూర విద్యా కేంద్రం ద్వారా రైతులు, మహిళలు, యువతకు దూరవిద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు చేసేందుకు ఆఖరు తేదీని పొడిగిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 3వ తేదీనుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం కోర్సులు 8 వారాల కోర్సులకు చివరి తేదీని ఈనెల 30 వరకూ పొడిగిస్తున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి కోర్సుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్‌నెట్‌తో కూడిన కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్, ఐపాడ్‌లలో ఏదో ఒకటి కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను కానీ 7036689346, 8096085560, సెల్ నంబర్లను ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకూ సంప్రదించవచ్చన్నారు.


