28న పల్స్‌ పోలియో ప్రత్యేక టీకా కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

28న పల్స్‌ పోలియో ప్రత్యేక టీకా కార్యక్రమం

Jun 23 2026 1:46 AM | Updated on Jun 23 2026 1:46 AM

28న పల్స్‌ పోలియో ప్రత్యేక టీకా కార్యక్రమం

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లాలో జాతీయ పల్స్‌ పోలియో టీకా కార్యక్రమం ఈనెల 28వ తేదీ ఆదివారం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో పల్స్‌ పోలియో ప్రత్యేక పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుండి ఐదేళ్ల వయస్సు గల 1,44,673 మంది చిన్నారులన్నారన్నారు. అందులో 1,42,336 మంది పిల్లలు, 2,337 మంది వలస చిన్నారులు ఉన్నారన్నారు. ప్రత్యేక దృష్టి అవసరమైన 384 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు ఏడు కోర్‌ గ్రూప్‌ అధికారులు, 913 టీకా కేంద్రాలు, 78 మొబైల్‌ బృందాలు, 156 రూట్లలో 156 రూట్‌ సూపర్‌వైజర్లు ఏర్పాటు చేయగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి 4,012 మంది వ్యాక్సినేటర్లు సేవలు అందించనున్నారని తెలిపారు. ప్రయాణికులు, వలస కుటుంబాల పిల్లలకు టీకాలు అందించేందుకు జిల్లాలో 24 ట్రాన్సిట్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని, ప్రతిపాడు, పొన్నూరు, కొల్లిపర, తెనాలి ఆసుపత్రి, మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి, డీవీఎస్‌ గుంటూరు కేంద్రాల్లో మొత్తం 6 బఫర్‌ స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్‌ విజయలక్ష్మి మట్లాడుతూ కార్యక్రమం కోసం జిల్లాకు 2,57,980 ఓపీవీ డోసులు (12,899 వయల్స్‌) అవసరమవుతాయని అంచనా వేయగా, జూన్‌ 19 నాటికి 2,16,000 డోసులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ, డీఆర్వో ఖాజావలి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దుర్గా ప్రసాద్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శ్రావణ్‌ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్‌ ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది

జిల్లాలో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడానికి, రెవెన్యూ, భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక కలక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరం జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవతో కలసి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్‌ –2026 కార్యక్రమం కింద ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ ఈనెల 23 నాటికి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కే.శ్రీనివాసరావు, శ్రీరమణి, డిప్యుటీ కలెక్టర్‌ గంగరాజు, సీపీఓ పి.శేషశ్రీ, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.విజయలక్ష్మి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement