ఎంటీఎస్‌ టీచర్లంటే అలుసా ! | - | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ టీచర్లంటే అలుసా !

Jun 23 2026 1:46 AM | Updated on Jun 23 2026 1:46 AM

మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్‌ అంటూ 12 గంటలకు సమాచారం రెండు గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఇబ్బందులు పడ్డ దూరప్రాంతాల ఉపాధ్యాయులు ప్రణాళిక లేని విద్యాశాఖ వైఖరిపై సర్వత్రా విమర్శలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక లోపించిన పనులతో మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి గుంటూరుజిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులను కొనసాగించేందుకు గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో గత విద్యాసంవత్సరంలో ఎంటీఎస్‌ పద్ధతిపై పని చేసిన వారిలో 297 మంది ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించేందుకు కౌన్సెలింగ్‌కు రావాల్సిందిగా పిలిచారు. అయితే కనీసం ఒక్క రోజు ముందుగా సమాచారం ఇవ్వకుండా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు రావాలని, రెండు గంటల ముందు అంటే మధ్యాహ్నం 12 గంటలకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో గుంటూరు జిల్లాతో పాటు రేపల్లె, మాచర్ల, దుర్గి, దాచేపల్లి, వెల్దుర్తి వంటి మారుమూల ప్రాంతాల నుంచి అభ్యర్థులు గుంటూరుకు హడావుడిగా బయలుదేరి వచ్చారు. ఒక్కరోజు ముందుగా సీనియార్టీ జాబితా ప్రకటించకుండా, కౌన్సెలింగ్‌ ఉందని అప్పటికప్పుడు పిలవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాయంత్రం 5 గంటలకు డీఈఓ షేక్‌ సలీమ్‌ బాషా ఆధ్వర్యంలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌ రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 9 గంటల సమయానికి 150 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ పూర్తయింది. కౌన్సెలింగ్‌ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు డీఈఓ కార్యలయంలో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కనీసం ఒక్కరోజు ముందుగా కౌన్సెలింగ్‌ సమాచారాన్ని పంపి, ఉదయయే కౌన్సెలింగ్‌ ప్రారంభించి ఉంటే దూర ప్రాంతాల అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేవని అభ్యర్థులు వాపోయారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పరిశీలించారు. డీఈఓ కార్యాలయ ఏడీ శైలజాబాయి, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్‌, ఎంఈఓలు కె.విజయభాస్కర్‌, ఎండీ ఖాసిం, సూపరింటెండెంట్లు డి.రాంబాబు, ఏ.జగదీష్‌, ఎం.నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement