నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) జరగ్గా, ఫిర్యాదిదారులకు గుంటూరు సాయినగర్‌కు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న నేతృత్వంలో సుమారు 200 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులు, వృద్ధులు, పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. సామాజిక సేవలో భాగస్వామ్యమైన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను జిల్లా ఎస్పీ అభినందించారు.
చేబ్రోలు: మండల పరిధిలో రెండు రోజుల కిందట అదృశ్యమైన ముగ్గురు బాలుర ఆచూకీ సోమవారం లభించినట్లు తెలిసింది. స్థానికంగా సంచలనం కలిగించిన 7వ తరగతి చదువుతున్న గుండవరం, వేజండ్ల, సుద్దపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత మాయమయ్యారు. పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారివద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్, వరంగల్లు తదితర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. ఏడవ తరగతి చదువుతున్న గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల గోపి, సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్, వేజండ్ల గ్రామానికి చెందిన జమీద్ అహ్మద్‌లు అదృశ్యమయ్యారు. వీరిలో ఒక బాలుడు స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేయటంతో ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఽఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న బాలురను ఒక షాపు అతను పట్టుకొని స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు, బాలురు తల్లిదండ్రులు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం చేబ్రోలు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. బాలుర ఆచూకీ లభించటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
లైంగికదాడికి యత్నించిన యువకుడికి రిమాండ్
దాచేపల్లి: నాయనమ్మపై మనవడు లైంగికదాడికి యత్నించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీ.పాపారావు సోమవారం తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారాయణపురంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల ఓ వృద్ధురాలు తన ఇంటి ముందు ఆరు బయట పడుకున్నది. ఈ క్రమంలో 25 సంవత్సరాల వయస్సున్న మనువడు వరుసైన జీ.వెంకట్ ఆమైపె లైంగికదాడికి ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయటంతో ఇంటిలో ఉన్న వాళ్లతోపాటుగా ఇంటి పక్కల వారు కూడా బయటకు వచ్చారు. దీంతో వెంకట్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకట్‌ని నడికుడి వద్ద అరెస్ట్ చేశారు.


