గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయులు జూలై 10లోగా దరఖాస్తు చేయాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌టీటీపీ://నేషనల్‌అవార్డ్స్‌టూటీచర్స్.ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. జూలై 13న తుది గడువు ముగియనుందని పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు
తెనాలిరూరల్: బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కొలకలూకు చెందిన 14 ఏళ్ల బాలిక స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఉన్నం ఇమ్మానియేల్ వెంట పడుతూ ఉండేవాడు. కొద్ది రోజులకు మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భిణి అని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులను సోమవారం ఆశ్రయించగా, కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ తెలిపారు.
పోలీస్ శాఖ ఔదార్యం
మంగళగిరి రూరల్: క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న తోటి ఉద్యోగి కుమారుడి వైద్య చికిత్స కోసం పోలీస్ శాఖ భారీ ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకుంది. మంగళగిరి ఆరో బెటాలియన్‌కు చెందిన డి.సి.హెచ్.కాంతారావు కుమరుడు క్యాన్సర్‌తో బాధ పడుతుండంతో అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీఎస్పీ ఐజీపీ బి.రాజకుమారి పిలుపునివ్వగా చందాల రూపంలో రూ.12.96 లక్షల నిధులు సేకరించారు. కాంతారావుకి చెక్కుని అందించారు.
రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక
యడ్లపాడు: బోయపాలెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్– 23 బాలుర ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో ఆర్.శివాజి, పి.సాగర్, ఎన్.శ్రీకర్‌ప్రసాద్, జె. శ్రీకాంత్, బి.అభినవ్, ఎం.అఖిల్, ప్రదీప్, ఎస్. బాలకోటేశ్వరరావు, చంటి, టి.రవితేజ, జి.ఇస్సాక్, కె.ప్రభాకర్ ఎంపికయ్యారు. ఎంపికను రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.భూషణం, ప్రిన్సిపాల్ డి.ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ కె.శిరీష్‌బాబు పర్యవేక్షించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27, 28 తేదీల్లో చిత్తూరులో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.


