లక్ష్మీపురం: రాష్ట్రంలో యువకు యోగాంధ్ర కాదని ఉద్యోగ ఆంధ్ర కావాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఈమేరకు సోమవారం అర్జీ అందజేశారు. తొలుత కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై ప్రభుత్వం పట్టినట్టు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు పిల్లలను అంటే రూ.30 వేలు ఇస్తామని, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని చెప్పారని, మీరు చెప్పినట్లు చేస్తే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యేల, మంత్రుల విద్యాలయాలలో ఉచితంగా చదువు చెప్పిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని హితవు పలికారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మరియదాసు, నాయకులు సుభాని, ఖాసిం వలి, కోటి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శశి, శివ, నాయకులు వెంకటేష్, కిరణ్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ట్ వద్ద ఏఐవైఎఫ్ నిరసన


