పంటకు ధర లేక విక్రయానికి దిగాలు అరకొరగా నాఫెడ్ కొనుగోలు ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూపు జిల్లాలో దిగుబడి 55 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేవలం 5,600 మెట్రిక్ టన్నులే మద్దతు ధర కంటే క్వింటాకు రూ.800 తక్కువ దళారులు, వ్యాపారుల దెబ్బకు రైతులు కుదేలు
ప్రభుత్వంపైనే ఆశలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇదీ గుంటూరు జిల్లాలో శనగ రైతుల పరిస్థితి. రబీ సీజనులో దిగుబడులు చేతికొచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో సేకరణ నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం శనగకు మద్దతు ధర క్వింటాకు రూ.5,875 గా ప్రకటించింది. మార్కెట్‌లో మాత్రం రూ.4,800 నుంచి రూ.5,000 మధ్యే ధర పలుకుతోంది. పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్ కొనుగోళ్లు పరిమితంగా ఉండటంతో ఎక్కువ మంది దళారులు, ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, ఫిరంగిపురం, తాడికొండ, తుళ్ళూరు తదితర మండలాల్లో ఈ ఏడాది గణనీయంగా శనగ పంట సాగైంది. వర్షాలు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు బాగానే వచ్చాయి. ధర లేకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ క్వింటా కనీస మద్దతు ధర రూ.5,875కు తొలిదశలో 5,600 మెట్రిక్ టన్నులను సేకరించింది. కోటా పూర్తయిందని కొనుగోళ్లు నిలిపేసింది. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటం, జిల్లాలో 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే అందులో కనీసం 10 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. అంతేకాకుండా నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం, గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడం, తేమ శాతం, నాణ్యత పేరుతో శనగలు కొనకుండా తిరస్కరించడం వంటి చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నామమాత్రంగా కొనుగోలు..
గుంటూరు జిల్లాలో రబీ సీజనులో శనగ సాగు సాధారణ విస్తీర్ణం 20,302.5 ఎకరాలు కాగా, జిల్లాలో 48,797.5 ఎకరాల్లో సాగు చేశారు. సుమారు 55 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ జిల్లాలో తొమ్మిది కొనుగోలు సెంటర్లు (పెదనందిపాడు–3, కాకుమాను–1, ప్రత్తిపాడు–1, వట్టిచెరుకూరు–1, తాడికొండ–1, తుళ్ళూరు–1, ఫిరంగిపురం–1) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.5,875 చొప్పున 1,122 మంది రైతుల నుంచి 5,600 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. అందులో ఇప్పటి వరకు 721 మంది రైతులకు రూ.14.50 కోట్లు చెల్లించారు. ఇంకా 421 మంది రైతులకు సుమారు రూ.15 కోట్లు మేర డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరో 200 టన్నులు కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాకు మొదటి విడతలో 5,600 టన్నుల కొనుగోళ్లకు అనుమతి లభించిందని, ఆ మేరకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోళ్లు చేశామని వెల్లడించారు. రైతుల నుంచి డిమాండ్ ఉండడంతో మరో 15 వేల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శనగలను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడం వరకే పరిమితమవుతోంది. కొనుగోళ్లు మాత్రం సక్రమంగా జరగడం లేదు. నమోదు చేసుకున్నా రోజుల తరబడి కాల్ రావడం లేదని, అప్పులు తీర్చాలి కాబట్టి దళారులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికీ సుమారు 401 మంది రైతుల ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కానీ 45 రోజులు గడుస్తున్నా .. నగదు జమ కాకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయి. రబీలో మొక్కజొన్న దిగుబడులు బాగున్నా.. ధరల్లేకపోవడం సమస్యగా మారింది. శనగ రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 48,797.5 ఎకరాల్లో శనగ సాగవ్వగా సుమారు 55 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కనీసం 20 వేల టన్నులైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు ఊరట లభిస్తుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు క్వింటా రూ.5,875కు విక్రయించినా గిట్టుబాటు కాదంటూ కొంతమంది రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు.


