గుంటూరు రూరల్: 2018 జూలై నెల నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు. రాష్ట్ర కోశాధికారి శివరామకృష్ణ సంఘం ఆర్థిక లావాదేవీల వివరాలను వివరించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెట్ చెల్లింపులకు చర్యలు తీసుకున్నందున ఆయా విషయాలపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్‌సీ నియామకానికి చర్యలు తీసుకోవాలని, అదనపు పెన్షన్ పుపరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లు తమ మెడికల్ బిల్లులను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల ద్వారా గానీ ట్రెజరీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానం ద్వారా సమర్పించేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లకు మెరుగైన ఆర్థిక రక్షణ కోసం రూ.5 లక్షల వరకూ కవరేజ్ కలిగిన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెన్షన్ స్లిప్‌లలో బకాయిల వివరాలు స్పష్టంగా చూపించకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, బకాయిల భాగాలను వివరంగా చేర్చాలని కోరారు. గతంలో అందుబాటులో ఉన్న బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ సౌకర్యాన్ని గత రెండేళ్ళుగా నిలిపివేశారని దాని వల్ల బిల్లుల స్థితిని తెలుసుకోలేకపోతున్నామని వెంటనే ఈ సౌకర్యాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంపీడీవో బి శ్రీనివాసరావు పెన్షనర్ల సమస్యలపై స్పందించి ప్రభుత్వానికి విషయాలను తెలియజేసి సంఘానికి సహకరిస్తానని తెలిపారు. కా ర్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఏపీపీఆర్‌డీఈఆర్‌ఈ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్


