అభివృద్ధి పేరుతో అనైతిక పనులు సహించం
ఖబరస్తాన్‌పై ఫ్లై ఓవర్ నిర్మించడం సరికాదు ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ ప్రతినిధుల ర్యాలీ
మంగళగిరి టౌన్ : శతాబ్దాల చరిత్ర కలిగిన ముస్లింల పవిత్ర ఖబరస్తాన్‌ను రహదారి విస్తరణలో భాగం చేయడమే కాకుండా అభివృద్ధి పేరుతో ఖబరస్తాన్‌పై ఫ్లై ఓవర్ నిర్మించాలని చూడడం సరికాదని ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జామియా మసీద్ వద్ద ప్రారంభమై ఎంటీఎంసీ కార్యాలయం, మెయిన్ బజార్, మిద్దె సెంటర్ మీదుగా తిరిగి గౌతమ బుద్ధ రోడ్ నుంచి నిడమర్రు కూడలి వరకు జరిగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా ఖబరస్తాన్ పై నుండి ఎందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తామని అంటున్నారని నిలదీశారు. ముస్లింల మనోభావాలతో చెలగాటం తగదని అన్నారు. ఖబరస్తాన్ భూమిలో ఫ్లై ఓవర్ వంటి నిర్మానాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేయడం ముస్లిం మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి చేసినట్టేనని విమర్శించారు. దానిని కాపాడుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ యూసుఫ్, అహ్లె సున్నతువల్ జమాద్ అధ్యక్షులు మునీర్, తబ్లీగ్ జమాత్ అధ్యక్షులు ఱఫీ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్, జమియ్యతే అహలే హదీస్ అధ్యక్షులు రఫీ, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీ, జమాతుల సభ్యులు, ముస్లిం మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పేరుతో అనైతిక పనులు సహించం


