19 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు
జన గణనకు సిద్ధం
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఉచిత పశు వైద్య శిబిరాలను ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. పశు వైద్య శిబిరాల పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్.కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని మండలాల్లో పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటుచేసి శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాలలో గొర్రెలు, మేకలు, పెద్ద పశువులు, లేగ దూడలకు ఉచితంగా నట్టల నిర్మూలన మందులు వేయడం జరుగుతుందని చెప్పారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు, అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తామని తెలిపారు. రైతులు ఉచిత పశువైద్య శిబిరాలలో అందించే పశు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు
వేగవంతం కావాలి
రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు అవసరమయ్యే గ్రావెల్, కంకర, రహదారి మెటీరియల్ తదితర అంశాలలో ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతుల మంజూరును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు జాప్యం జరగరాదని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో జన గణన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ జిల్లా కలెక్టర్లతో జనగణన కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన జనాభా లెక్కల అధికారిగా కలెక్టర్ వ్యవహరించడం జరుగుతుందని, అదనపు ప్రధాన జనాభా లెక్కల అధికారిగా జేసీని నియమించామన్నారు. జిల్లా జనాభా లెక్కల అధికారిగా డి.ఆర్.ఓ, అదనపు జిల్లా జనాభా లెక్కల అధికారులుగా జిల్లా ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖాధికారి, జడ్పీ సీఈవో, సర్వే శాఖ ఏడీ, పంచాయతీరాజ్ అధికారి, జిల్లా ఫారెస్టు ఆఫీసర్ను నియమించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, సీపీఓ శేషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్


