
నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా తెనాలి
తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ
తెనాలి రూరల్: తెనాలి నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా మారింది. కొందరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, దళారుల అండతో యథేచ్చగా నకిలీ ధ్రువపత్రాల దందా కొనసాగుతోంది. ఈ పత్రాలతో ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన గాజుల బసవ పూర్ణకుమారికి చెందిన రెండెకరాల మాగాణి, 17 సెంట్ల ఇంటి స్థలాన్ని కాజేయడానికి సొంత మేనల్లుడు కోలపల్లి నరేష్, అతని తండ్రి సత్యనారాయణతో కలిసి పథకం పన్నాడు. 2020లో పూర్ణకుమారి మృతి చెందినట్లు, అంతకుముందే ఆమె భర్త సత్యనారాయణ కూడా మరణించినట్లు తప్పుడు మరణ ధ్రువపత్రాలు సృష్టించి నిందితుడు నరేష్ కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించాడు. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా డాక్యుమెంట్ రైటరుగా పనిచేస్తున్న తిరుపతి మరియదాస్ అలియాస్ దాస్, తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మీ–సేవ కేంద్రం నిర్వహిస్తున్న దాసరి శివన్నారాయణతో కలసి దొంగపత్రాలు సృష్టించి, సదరు హక్కు విడుదల దస్తావేజులు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించిన నరేష్ తన మేనత్త పూర్ణకుమారికి చెందిన యావదాస్తిని విక్రయించి రూ.55 లక్షలు సొమ్ము చేసుకున్నాడు. అంతే కాకుండా ఆమెకు చెందిన 17 సెంట్ల ఇంటి స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హైదరాబాద్, దుగ్గిరాల, తెనాలి పట్టణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించాడు. మేనల్లుడి నిర్వాకం గురించి తెలుసుకున్న బసవ పూర్ణకుమారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నరేష్, అతని తండ్రి సత్యనారాయణ, డాక్యుమెంట్ రైటర్ మరియదాస్, మీ–సేవ శివలను అరెస్ట్ చేశారు. మంగళగిరికి చెందిన విశ్రాంత బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి 2019లో రిజిస్టర్డ్ వీలునామా చేయించి, 2020లో మృతి చెందారు. తన తదనంతరం ఆస్తి తన రెండో భార్య సంతానానికి చెందేలా వీలునామా రిజిస్టర్ చేయగా, మొదటి భార్య కుమారులు నకిలీ వీలునామా సృష్టించి ఆస్తిని తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. తాజాగా పట్టణ నందులపేటకు చెందిన ఓ వ్యక్తి 2017లో మృతి చెందాడు. ఇతని కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని నకిలీది సృష్టించి ఆస్తిని వినుకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగికి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించగా తహసీల్దార్ పరిశీలనకు పంపారు. తన సంతకాన్ని ఫోర్టరీ చేసి నకిలీ ధ్రువపత్రం తయారు చేశారని గుర్తించిన తహసీల్దార్ గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను తయారుచేసిన/తయారు చేయించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వెళ్లే వారు విక్రయదారులు ఇచ్చే పత్రాలను ఒటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని, అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా నకిలీ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా తెనాలి