
వ్యర్థాలతో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మురుగునీటి శుద్ధి ప్లాంటు ప్రారంభం
తెనాలి: ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పంట పొలాలు, నీటిలో కలుస్తుండటంతో క్యాన్సర్ వ్యాప్తి చెందుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉండరాదనే తెనాలికి రూ.30 కోట్ల వ్యయంతో 10 ఎంఎల్‌డీ లీటర్ల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. పట్టణ పూలే కాలనీలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ముఖ్య అతిథి పెమ్మసాని మాట్లాడుతూ తెనాలి రైల్వేస్టేషను అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెనాలి–మంగళగిరి రోడ్డు, నారాకోడూరు–తెనాలి రోడ్డును అద్దంలాగ తీర్చిదిద్దినట్టు చెప్పారు. డాక్టర్ ప్రతాప్ కోటి రూపాయల వితరణతో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వీటిన్నిటి నిర్వహణను ఎక్కడికక్కడ స్థానికులతో ఏర్పాటైన కమిటీలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలంతా నగదు స్థానంలో డిజిటల్ చెల్లింపులు చేస్తే అమరావతి అమెరికాలా అవుతుందని సూచించారు. జీఎస్టీ తగ్గింపు పాటించని వ్యాపారులను ప్రశ్నించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మురుగునీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుతం ప్రారంభించిన ప్లాంటుతో పాటు పట్టణానికి రెండో వైపున మరో 10 ఎంఎల్‌డీ లీటర్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యశాఖ, మున్సిపాలిటీలు ఒక నోడల్ అధికారితో ప్లాంట్ నిర్వహణను సమీక్షిస్తుండాలని సూచించారు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అమృత పథకం కింద నిర్మించిన చాలా ప్లాంట్లలో నిర్వహణ సరిగా లేదని తెలిపారు. తెనాలి ప్లాంటును సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి పలు ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు, ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.