
జీజీహెచ్‌ను సందర్శించిన కలెక్టర్
అత్యవసర సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి
గుంటూరు మెడికల్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలియజేశారు. విద్యార్థులకు, అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో మరమ్మతులకు గురైన పరికరాలను ఉపయోగంలోకి తీసుకుని రావాలని చెప్పారు.
విద్యార్థులంతా సేఫ్
అన్నపర్రు వసతి గృహంలో విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య తెలిపారు. జిల్లాలో ఉన్న 33 వసతి గృహాలకు గాను, 24 చోట్ల ఇప్పటికే నీటి నమూనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మిగిలిన చోట్ల త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయికుమార్, ఇతర అధికారులు అన్నపర్రులో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి పరిస్థితులు పరిశీలించారు.