
పెద్దాసుపత్రికి సుస్తీ
జీజీహెచ్‌లో వసతులు కరువు రోగులకు అవస్థలు పిల్లల వార్డులో తుప్పుపట్టిన మంచాలు పనిచేయని ఏసీలు దుప్పట్లు మార్చడం లేదు బాత్‌రూమ్స్‌కు డోర్స్ లేవు
గుంటూరు మెడికల్: ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలు ఏకరవు పెడుతున్నాయి. ఇటీవల డయేరియా బాధితుల వార్డులో వసతులు లేక రోగులు నరకయాతన పడ్డారు. నేడు పెద్దాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. పిల్లల వార్డులో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇటీవల గుంటూరు నగరంలో డయేరియాతో సుమారు 200 మంది వరకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. బాధితుల కోసం ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వసతులు కరువయ్యాయి. సైలెన్ స్టాండ్స్ సరిపడా లేక కిటికీలకు వేలాడదీశారు. పడకలపై బెడ్ షీట్స్ లేవు. మరుగుదొడ్లలో నీటి సమస్య నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. సమస్యల మధ్యే రోగులు చికిత్స పొందారు.
సమస్యలు స్వాగతం
నేడు వాంతులు, విరేచనాలతో అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పిల్లల వైద్య విభాగానికి వచ్చారు. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ, మరో పక్క వార్డులో వసతుల లేమి, సమస్యల మధ్యే చికిత్స పొందుతున్నారు. వార్డు వ్యాధి బాధితులతో కిక్కిరిసి పోయింది. ఏసీలు పనిచేయక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పడకలపై కనీసం బెడ్‌షీట్లు కూడా లేవు. మంచాలు సైతం తుప్పు పట్టిపోయాయి. రోగి పడుకుని చికిత్స పొందాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బందికి సైతం వసతులు లేక ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లల వార్డులోని బాత్రూమ్‌కు కనీసం డోర్ కూడా లేకపోవడం దారుణం.
తనిఖీలకే అధికారులు పరిమితం
ఆస్పత్రి అధికారులు ప్రతిరోజూ తనిఖీల పేరుతో పలు వార్డుల్లో తిరుగుతున్నా ప్రయోజనం లేదు. వార్డుల్లో సమస్యలు అధికారులు కనిపించటం లేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించటం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ‘మీ కోసం మేము’ అనే కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు నిర్వహిస్తున్నారు. రోగులను ఒకచోట సమావేశపరిచి సమస్యలు ఉంటే చెప్పాలని, తక్షణమే పరిష్కరిస్తామని భరోసా మాటలు చెబుతున్నారు. అయితే, అవి కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల తూతూమంత్రంగా తనిఖీలు చేసి సమస్యలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి, ప్రశాంతమైన వాతావరణంలో వైద్యసేవలు అందించేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు.

పెద్దాసుపత్రికి సుస్తీ

పెద్దాసుపత్రికి సుస్తీ

పెద్దాసుపత్రికి సుస్తీ

పెద్దాసుపత్రికి సుస్తీ