ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి

Oct 12 2025 7:10 AM | Updated on Oct 12 2025 7:10 AM

ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి

ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి

ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి సవిత స్పష్టం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత ఆదేశించారు. హాస్టల్‌ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ, డైరెక్టర్‌ మల్లికార్జున, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణతో మంత్రి సవిత శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణను అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వివరించారు. ఆ విద్యార్థి ఇంతకుముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఐసీయూలో వైద్యమందిస్తున్నామని తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. మంత్రి సవిత స్పందిస్తూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్‌ డేట్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్‌కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు.

వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి

డిశ్చార్జి అయిన వారితో పాటు హాస్టల్‌లో మిగిలిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, డైరెక్టర్‌ మల్లికార్జునను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్‌లో పరిశుభ్రతతపై తీసుకున్న చర్యల గురించి డీబీసీడబ్ల్యూవో మయూరిని అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటితోపాటు తాజా ఆహారమే వారికి అందివ్వాలన్నారు. హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్‌ చల్లాలని స్పష్టం చేశారు. హాస్టల్‌ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్లకు వెళ్లదలుచుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిచి వారితో పంపించాలని సూచించారు.

ఘటనలు పునరావృతం కానివ్వొద్దు

అన్నపర్రు బీసీ హాస్టల్‌ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలని తెలిపారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం లోపలకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టెలీ కాన్ఫరెనన్స్‌లో మంత్రి సవిత స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement