
పసివాళ్లంటే ఎంత అలుసో..!
అస్వస్థతకు గురైన 54 మంది అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు
బాధితులను ఆస్పత్రికి తరలించిన కుక్, ఉపాధ్యాయులు
కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
హాస్టల్‌లో ఆహారం, తాగునీటి నమూనాలు సేకరించిన అధికారులు
వార్డెన్ నిర్లక్ష్యం..
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రి పాలైన హాస్టల్ విద్యార్థులు
ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ హాస్టల్‌లో నాలుగు నుంచి పది తరగతుల వరకు మొత్తం 107 మంది విద్యార్థులున్నారు. వీరికి గురువారం రాత్రి బెండకాయ వేపుడు, రసం, మజ్జిగతో భోజనం పెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒకరి తరువాత ఒకరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. గమనించిన నైట్ వాచ్‌మన్ విషయాన్ని ఉదయం విధులకు వచ్చిన కుక్ కల్పనకు చెప్పారు. అప్పటికే 17 మంది అస్వస్థతకు గురై బాధపడుతుండటంతో కల్పన వారిని ఆటోలో పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు. ఉదయం కిచిడీ, టమాట చట్నీతో టిఫిన్ చేసిన తరువాత అదేవిధంగా బాధపడుతున్న మరో 37 మంది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు 108 వాహనాల్లో పంపించారు. సాయంత్రానికి 21 మందిని డిశ్చార్జ్ చేసి హాస్టల్‌కు తరలించగా, 17 మంది శిబిరంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్‌సీకి చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి హాస్టల్‌ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో సరిపోని బెడ్లు
ఒక్కసారే సుమారు యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రిలో ఉన్న బెడ్లు సరిపోలేదు. దీంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడా పడుకోబెట్టి చికిత్స అందించారు. మంచం చుట్టూ సైలెను స్టాండ్లు పెట్టడంతో చేతులు అటూ ఇటూ కదపలేక, కడుపునొప్పి తాళలేక విద్యార్థులు నరరకయాతన అనుభవించారు. అనంతరం వారి ఇబ్బందులను గమనించిన కలెక్టర్.. కల్యాణమండపంలో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. సైలెన్ స్టాండ్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో విద్యార్థులే ఒక చేతితో సైలెన్ బాటిల్ పట్టుకుని కనిపించగా, మరికొందరికి ఆశా కార్యకర్తలు బాటిళ్లు పట్టుకోవాల్సి వచ్చింది.
తీవ్ర జ్వరంతో బాధపడుతూ..
అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో పదహారు మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జ్వరం కూడా ఉన్నట్లు వైద్యులు గమనించారు. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవ్వడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. దీంతో ఆయా శాఖల అధికారులు ఆహార పదార్థాల, తాగునీటి నమూనాలను సేకరించారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కూడా బయటి నుంచి బిర్యానీ, కలియా, పెరుగు చట్నీలు వచ్చాయి. వాటిని విద్యార్థులకు అందించారు. మరుసటి రోజు నుంచి కడుపునొప్పితో బాధపడినట్లు కొందరు విద్యార్థులు చెప్పారు.
మంత్రి దుర్గేష్ ఆరా
గుంటూరు మెడికల్: హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. వారు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ అలసత్వం... బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల ఉదాసీనత వెరసి వసతి గృహ విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యేలా చేసింది. 54 మంది అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. ఘటనకు కారణం కలుషిత ఆహారమేనని అధికారులు భావిస్త్తున్నారు. పేద పిల్లల ప్రాణాలంటే కూటమి సర్కారుకు ఎంత అలుసో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
గురువారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలోగానీ, ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడుగానీ, వారిని ఆస్పత్రికి తరలించే సమయంలోగానీ వార్డెన్ అందుబాటులో లేకపోవడం ఆయన విధుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కుక్‌కు సమీప బంధువు అయిన అశోక్ గత కొద్ది నెలలుగా హాస్టల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి జీతం కూడా వార్డెన్ తన జేబు నుంచే చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అశోక్ గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నీరు మాత్రమే తాగాడని సిబ్బంది చెబుతున్నారు.

పసివాళ్లంటే ఎంత అలుసో..!

పసివాళ్లంటే ఎంత అలుసో..!