
సంపూర్ణ ఆరోగ్యానికి ఈత దోహదం
జస్టిస్ ఎన్. హరినాథ్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈతతో మెరుగైన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్యామలానగర్‌లోని ఈత కొలనులో కానాల అంజనీ శ్రీకాంత్ రెడ్డి స్మారక 8వ మాస్టర్స్ అంతర్ జిల్లాల పోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక క్రీడలో సాధన చేయాలన్నారు. యోగా కూడా ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమణ రావు మాట్లాడుతూ 20–90 ఏళ్ల వరకు వయస్సున్న వారికి ఈ పోటీలను ఏటా మాదిరిగానే నిర్వహించామన్నారు. 180 పాల్గొన్నారన్నారు. పోటీలను ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.