బకాయిలు చెల్లించేవరకు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రుల వెల్లడి
కూటమి సర్కారు తీరుతో వైద్యరంగం అస్తవ్యస్తం
వైద్యసేవల కోసం పేదల అగచాట్లు
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన నెట్‌వర్క్ ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. దీంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు. బంద్ పాటించారు. జిల్లా వ్యాప్తంగా 154 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటిల్లో 33 ప్రభుత్వ, 121 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అసోసియేషన్ పిలుపు మేరకు గుంటూరు కొత్తపేట ఓల్డ్‌క్లబ్ రోడ్డులోని పలు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. రోగులు, అంబులెన్సులతో నిత్యం కిటకిటలాడే ఈ రోడ్డు శుక్రవారం మామాలు రద్దీతో కనిపించింది. రోజూ పథకం ద్వారా చికిత్స అందించేందుకు నెట్‌వర్క్ ఆసుపత్రులు అనుమతి కోసం ట్రస్టు కార్యాలయానికి నివేదికలు పంపిస్తుంటాయి. బంద్ ప్రభావంతో శుక్రవారం ఈ అనుమతులు చాలా తక్కువ సంఖ్యలో కోరినట్లు సమాచారం.
కీలక డిమాండ్లు తీరిస్తేనే...
నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ. 2,700 కోట్ల బకాయిలు ఉన్నట్లు సంఘం నేతలు వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి హెల్త్ ప్యాకేజీల్లో పెరుగుదల నామమాత్రంగా ఉందని పేర్కొన్నారు. 2010 నాటి పరిస్థితితో పోలిస్తే నెట్‌వర్క్ ఆసుపత్రులపై భారం పడుతున్నట్లు వాపోయారు. ఆసుపత్రుల ఖర్చులు పెరిగిపోయినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల సమ్మెకు పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. డిమాండ్‌లను పరిష్కరించే వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పేదల ప్రాణాలకు భరోసా కరువు
కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠినాత్మక నిర్ణయం వల్ల పథకం ద్వారా లభించే ఉచిత వైద్య సేవలు పేదలకు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. తద్వారా వివిధ రోగాలకు చికిత్స చేయించుకునే వారు డబ్బులు పెట్టాల్సి వచ్చింది. కొంతమంది స్థోమత లేక అల్లాడిపోతున్నారు. పేదోళ్ల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండటం లేదు. సరిగ్గా వైద్య సేవలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ ఆసుపత్రుల వైద్య సేవల నిలిపివేత ప్రభావం పేదలపై ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా పట్టువీడాలని రోగులు కోరుతున్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవ బంద్