
చల్ మోహన రంగా...
తెనాలి: పట్టణంలో శుక్రవారం రహదారిపై దౌడు తీస్తూ వస్తున్న గుర్రాన్నీ, బుర్రమీసాలు, తలపాగాతో దానిపై స్వారీ చేస్తున్న వ్యక్తిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి పేరు ఉయ్యూరు లక్ష్మారెడ్డి. చుండూరు మండల గ్రామం కార్మూరివారిపాలెం వాసి. ప్రఖ్యాత కవి సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.శివారెడ్డి స్వగ్రామం కూడా ఇదే. వేమూరు నియోజకవర్గంలోని ఆ గ్రామం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది. 61 ఏళ్ల లక్ష్మారెడ్డికి వ్యవసాయమే జీవనాధారం. 61 సెంట్ల పొలం ఉంది. అబ్బాయి, అమ్మాయి. కానీ బాధ్యతల బరువు లేదు. సంసార సాగరాన్ని అవలీలగా ఈదేసిన వ్యక్తికి, గుర్రం స్వారీ ఓ లెక్కా అన్నట్టుంది ఆయన తీరు. కళ్లెం లాగుతూ రెండో చేతితో చెర్నాకోలను పట్టుకుని ఒక లయ అతడి స్వారీలో కనిపించింది.15 ఏళ్లప్పుడు గుర్రం కొనాలని అనుకున్నా.. 30 ఏళ్లు వచ్చాక కొన్నారు. గుర్రాలు మారినా తన స్వారీ మాత్రం ఆగలేదు. అవసరమైతే మహారాష్ట్ర వెళ్లి గుర్రం తెస్తుంటానని చెప్పారు. రోజూ గుర్రానికి ఉలవలు, పచ్చిగడ్డి ఆహారంగా ఇస్తుంటారు. ఎక్కడికై నా ఇలానే వెళుతుంటానని చెప్పారు.