
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
జిల్లా కలెక్టర్
ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్ : అనారోగ్య బారిన పడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడ వద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం స్థానిక పాత గుంటూరు యాదవ బజార్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఏపీ సీపీడీసీఎల్ పర్యవేక్షక
ఇంజినీర్ రమేష్
కొరిటెపాడు(గుంటూరు): నెలాఖరు నేపథ్యంలో గుంటూరు సర్కిల్ పరిధిలోని విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఆదివారం సెలవు రోజు అయినా కౌంటర్లు పనిచేస్తాయని ఏపీ సీపీడీసీఎల్ గుంటూరు సర్కిల్ ప్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయన్నారు. అంతేకాకుండా ఇంటి నుంచే నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించేలా మొబైల్‌లో ఏపీ సీపీడీసీఎల్ కస్టమర్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే నుంచి కూడా బిల్లులు చెల్లించవచ్చని ఆయన తెలియజేశారు.
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం సంస్థలో భాగమైన గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. రాజకుమారికి ప్రకృతి వ్యవసాయ రాష్ట్రాస్థాయి విస్తరణ అధికారిగా అవార్డు లభించింది. ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కిసాన్ మహోత్సవం–2025లో ఎంఎల్‌సీ సోమువీర్రాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబుల చేతుల మీదుగా ప్రకృతి వ్యవసాయ రాష్ట స్థాయి విస్తరణ అధికారిగా అవార్డును ఆమె వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తరించడానికి, రైతులలో అవగాహన పెంచడానికి, ఎన్నో అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు.