
పోటెత్తిన కృష్ణమ్మ
పల్లపు ప్రాంతాలు జలమయం నీట మునిగిన అరటి, పసుపు, కంద పంటలు
కొల్లిపర: ఎగువ కురిసిన భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తింది. కృష్ణా బ్యారేజీ నుంచి 6.80లక్షల క్యూసెక్కులను సోమవారం అధికారులు దిగువకు విడుదల చేయడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు గ్రామాల్లో నదికి దిగువున ఉన్న పంట పొలాలు, పాత బొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరులంక గ్రామాల్లో పలు వాణిజ్య పంటలు నీటిలో మునిగి పోయాయి. కరకట్ట దిగువున లంక గ్రామాల్లోని నాలుగు వేల ఎకరాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న, మినుము, కూరగాయలు, నిమ్మ పంటలను సాగు చేపట్టారు. ఇందులో వెయ్యి ఎకరాల దాకా నీట మునిగాయి. వరద నీటితో అరటి, కంద, పసుపులకు దుంప కుళ్లి పోతుందని వాపోతున్నారు. వరద నీరు బయటకు పోయిన తరువాత నిదానంగా చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు పంటలను కన్న బిడ్డలా కాపాడుకుంటూ వచ్చామని, తెగుళ్లు లేకుండా ఏపుగా పెరుగుతున్న సమయంలో వరద నీరు తమకు అప్పులు తెచ్చిపెడుతుందని పలువురు రైతులు వాపోతున్నారు.

పోటెత్తిన కృష్ణమ్మ

పోటెత్తిన కృష్ణమ్మ