
ప్రజలకు అండగా వైఎస్సార్ సీపీ
పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పొన్నూరు: కూటమి పాలనలో నమోదయ్యే అక్రమ కేసులతో వెనకాడేది లేదని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం పొన్నూరు మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఓ కేసులో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనలో బాధితుల పక్షాన నిలిచిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. జరిగిన అన్యాయంపై ఆవేదనకు గురైన ఓ బాధిత మహిళ పక్షాన నిలిచి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ మీడియాతో మాట్లాడినా కూడా కేసు నమోదు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్‌లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఇప్పటికే వందలాదిగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.