
ప్రతి అర్జీని పరిశీలించాల్సిందే !
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మొక్కుబడి పరిష్కారాలకు సెలవు పీజీఆర్‌ఎస్‌లో నూతన విధానం అమలు
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన ప్రతి అర్జీని పరిశీలించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న తీరు, పరిష్కార విధానం, కౌంటర్లను ఆమె పరిశీలించారు. అనంతరం కొన్ని చేర్పులు, మార్పులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ, జీఎస్‌డబ్ల్యూఎస్, రిజిస్ట్రేషన్, విద్యా, పోలీస్, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించి, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలో పరిష్కరించాల్సిందేనని ఆదేశించారు. వివరాలు ముందుగా అవగాహన చేసుకోవాలని, ప్రభుత్వ విధానాలకు సంబంధించిందా లేదా ఇతర అంశాలకు సంబంధించిందా అనేది చూడాలని ఆదేశించారు. అర్జీలకు సంబంధించి స్పష్టమైన, వాస్తవ వివరాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారు. సోమవారం అందిన అర్జీలు శుక్రవారం నాటికి పూర్తి చేసి డేటాను అప్ లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 222 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి గంగరాజు, డెప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పరిశీలించారు.