Moonlighting: రెండు పనులు చేయడం తప్పేనా?

Sushma Ramachandran Analysis On Moon Lighting In IT - Sakshi

విశ్లేషణ

ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్‌’ అంటారు. మనదేశంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల అప్రమేయంగా ఒనగూడుతున్న సమయ సదుపాయంతో ప్రస్తుతానికి కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు మాత్రమే ‘మూన్‌లైటింగ్‌’ చేస్తుండవచ్చు గానీ, భవిష్యత్తులో ఈ ధోరణి మరింతగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఒకే సమయంలో అనేక అసైన్‌మెంట్‌లపై పని చేయడం అన్నది ఉద్యోగ ఒప్పందాల సాంప్రదాయ ప్రమాణాలకు భిన్నమైనదిగా పరిగణన పొందవచ్చు. కానీ కోవిడ్‌ మహమ్మారి తరువాత మారిన పరిస్థితులలో కార్యస్థానాన్ని అనువైనదిగా మార్చుకున్నప్పుడు, మూన్‌లైటింగ్‌ అనే సమస్యపై దృక్కోణాన్ని మార్చుకోవడం కూడా అవసరమే.

‘మూన్‌లైటింగ్‌’ అన్నది పాతమాటే. అయితే ప్రసిద్ధ ఐటీ కంపెనీ ‘విప్రో’ ఇటీవల అనూహ్యంగా 300 మంది ఉద్యోగులను తొలగించడంతో ఈ మాట మళ్లీ కొత్తగా వినిపించడం మొదలైంది.  ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక  ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్‌’ అంటారు. పూర్వపు నానుడిగా చెప్పాలంటే... ‘పగలొక ఉద్యోగం, రాత్రొక ఉద్యోగం’. వాస్తవానికి కూడా ‘మూన్‌లైటింగ్‌’ అనే మాట అలా పుట్టిందే. అయితే ఐటీ కంపెనీలు విస్తరించాక, ఐటీ ఉద్యో గాలకు పగలూ రాత్రీ లేకుండా పోయాక మూన్‌లైటింగ్‌ అనే మాట ‘రహస్యంగా రెండో ఉద్యోగం’ అనే అర్థానికి పర్యాయ పదం అయింది.

కంపెనీల చట్టం ప్రకారం దొంగచాటుగా ఇంకో ఉద్యోగం చేయకూడదన్నది నిబంధన. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో తన ఉద్యోగులను తొలగించిందని అనుకోవాలి. అనూహ్యమైన ఆ చర్య భారతదేశంలోని 227 బిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ పరిశ్రమల రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ విషయంలో కొన్ని ఐటీ కంపెనీల యజమానులు విప్రో వైపు ఉండగా, మరికొన్ని కంపెనీలు ‘‘చెప్పి చేస్తే తప్పు కాదు’’ అనే సర్దుబాటుతో మూన్‌లైటింగ్‌ను అంగీకరించేందుకు సైతం సిద్ధంగా ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న ఉద్యోగ సంస్కృతిని పరిశీలించి చూస్తే కనుక మూన్‌లైటింగ్‌ అన్నది భిన్నమైన కోణాన్ని కలిగి ఉన్న ఒక పని నమూనాగా అవతరిస్తోంది. నిపుణులకు, నైపు ణ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకు మూన్‌లైటింగ్‌ అప్రధానమైన విషయమే. ‘ఇంటి నుండి పని’ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) విధానంలో ఆమోదం పొందిన విధి నిబంధనలకు అనుగుణంగానే మూన్‌లైటింగ్‌ అనే దానికి అప్రకటిత ఆమోదం ఉంటుంది. ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశం లభించాక యువ నిపుణులు తమ కార్యస్థావరాలను బీచ్‌లకు, పర్వతాలకు సైతం మార్చుకుని సమ ర్థంగా తమ కంపెనీ విధులను నిర్వహిస్తున్నప్పుడు పనిలో పనిగా బయటి కార్పొరేట్‌ కంపెనీల నుంచి ప్రాజెక్టులు స్వీకరించడానికి ఉన్న వెసులుబాటును ఉపయోగించుకోవడం వల్ల ఎవరికి నష్టం?

మనదేశంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల అప్రమేయంగా ఒనగూడు తున్న సమయ సదుపాయంతో ప్రస్తుతానికి కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు మాత్రమే మూన్‌లైటింగ్‌ చేస్తుండవచ్చుగానీ, భవి ష్యత్తులో ఈ ధోరణి మరింతగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. అక్కడితో ఆగకుండా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి మూన్‌లైటింగ్‌ ఒక విజయ వంతమైన ప్రత్యామ్నాయ చోదకశక్తిగా కూడా యాజమాన్యాలకు, ఉద్యోగులకు కనిపించవచ్చు.

అంటే మున్ముందు ఐటీ కంపెనీలలో మూన్‌లైటింగ్‌ ఒక అంగీకారయోగ్యమైన పని విధానం కావచ్చు! జూనియర్‌ ఐటీ ఉద్యోగులకు జీతాలను పెంచే విషయంలో ఏమాత్రం ఔదార్యాన్ని ప్రదర్శించని ప్రముఖ టెక్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు, కంపెనీ వ్యవస్థాపకులకైతే ఇది తప్పక ఆమోదయోగ్యం అవుతుంది. ఉద్యోగులకు వారు ఆశించిన స్థాయి జీతాలను పెంచలేనప్పుడు మూన్‌లైటింగ్‌కు కంపెనీలు చెప్పే అభ్యంతరం ఏముంటుంది?

ఐబీఎం, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ దిగ్గజాలు మూన్‌లైటింగ్‌ను పని సంప్రదాయానికి వ్యతిరేకమైన చట్టవిరుద్ధ చర్యగా పరిగణించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ కంపెనీల ఉద్యోగులు పూర్తి సమయం కంపెనీ పని మీదే ఉండాలి. కంపెనీల వ్యవహారాల పట్ల గోప్యత లేకుంటే పోటీ కంపెనీలు పైచేయి సాధించే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన సహజమే కనుక నిస్సందేహంగా వారు మూన్‌లైటింగ్‌ను ఆమోదించరు. అయితే మూన్‌లైటింగ్‌ను ఆమోదించడం ద్వారా సమాచార గోప్యతకు సంబంధించిన ఆందోళనలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది! ఉద్యోగులు తమ మూన్‌లైటింగ్‌ ప్రాజెక్ట్‌లు లేదా అసైన్‌మెంట్‌ల గురించిన సమాచారాన్ని దాచకుండా పంచుకుంటారు కనుక వారిపై అనుమానాలకు తావుండదు. 

పని విధానాల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఒక సంఘంగా ఏర్పడిన ఐటీ పరిశ్రమ ఉద్యోగులు కూడా మూన్‌లైటింగ్‌ కొత్తదేమీ కాదనీ, దశాబ్దాలుగా ఇది లాభదాయకమైన అంకుర సంస్థల ఆవిర్భావానికి దారి తీసిందనీ అంటున్నారు. ఈమాట నిజం. ఎందుకంటే చాలామంది అంకుర సంస్థల వ్యవస్థాపకులు కొత్త వెంచర్‌లను నెలకొల్పే అవకాశాలను అన్వేషించేటప్పుడు తమ ‘పూర్తి సమయ’ ఉద్యోగాలలో ఉన్నవారే. అంతమాత్రాన యాజమాన్యాలు తమ ఉద్యోగుల వల్ల తమకు భవిష్యత్తులో పోటీగా అవతరించబోయే స్టార్ట్‌–అప్‌ల గురించి కలత చెందనవసరం లేదు.

వాస్తవానికి ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు అదనంగా బయటి నుంచి అసైన్‌మెంట్‌లను తీసుకోవడానికి ప్రధాన కారణా లలో ఒకటి.. పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యా లకు మెరుగు పరచుకోవడమేనని ఇప్పటికే పలు నివేదికలలో వెల్లడ యింది. ఈ రంగంలో సాంకేతికత త్వరత్వరగా పాతబడిపోతుం టుంది. అలాంటప్పుడు కొత్త నైపుణ్యాలతో ముందుకు వెళ్లడం అత్యవసరం. పైపెచ్చు ఈ మూన్‌లైటింగ్‌... కృత్రిమ మేధస్సు లేదా ఇతర హైటెక్‌ రంగాలలో ఉద్యోగాల పరంగా అయినా,  దీర్ఘకాలంలో మరింత లాభదాయకమైన రంగాల్లో ఉపాధి పొందేందుకైనా వీలు కల్పిస్తుంది కాబట్టి, ఎక్కువ సంపాదించడం ముఖ్యం అయినప్పటికీ, ఇది కేవలం సంపాదించడానికే కాదు. 

ఈ మొత్తం మూన్‌లైటింగ్‌ కథను గ్లోబల్‌ గిగ్‌ ఎకానమీ (స్వల్ప కాలిక ఉపాధికి ప్రాధాన్య ఇచ్చే ఆర్థిక వ్యవస్థ) నేపథ్యంలో ప్రాధాన్యం పొందుతున్న విధానంగా భావించాలి. ఉద్యోగులు తమను తాము సంప్రదాయ 9–5 ఉద్యోగాలతో ముడిపెట్టుకోకుండా బహుళ క్లయిం ట్‌ల కోసం స్వల్పకాలిక ఆర్జన విధులు చేపడతారనే వాస్తవమే మూన్‌ లైటింగ్‌కు పునాది. అదే సమయంలో, అదే గిగ్‌ ఎకానమీ భారతీయ వ్యవస్థలోకి మారి నప్పుడు చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించాలి. ఉదాహరణకు, విదేశాలలో ఊబర్‌ డ్రైవర్లు తమ సొంత వాహనాలను రోజుకు కొన్ని గంటలపాటు టాక్సీలుగా ఉపయోగించే వ్యక్తులు కావచ్చు. మన దేశంలో, ఊబర్‌ను నడపడం పూర్తి కాలపు ఉపాధి.  

ఐటీ పరిశ్రమ విషయానికొస్తే, ప్రపంచ పరిస్థితులతో ఇక్కడ ఎక్కువ సారూప్యం ఉంది. భారతీయ టెక్‌ కార్మికులు విదేశాలలో ఉన్న వారి మాదిరిగానే ఎక్కువ లేదా తక్కువ పని చేస్తున్నారు. అంతే కాదు, ఇక్కడ చాలామంది విదేశీ అసైన్‌మెంట్‌లతో వ్యవహరించ డంలో అనుభవజ్ఞులు. అయితే, ఈ రంగానికి సంబంధించిన సమ స్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నందున వాటిని సున్నితంగా పరిష్కరించాలి. మెకిన్సే అధ్యయనం ప్రకారం, భార తీయ ఐటీ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 శాతం వృద్ధి రేటుతో 300–350 బిలియన్ల మార్కును చేరుకోగలదని అంచనా.

ప్రస్తుత చట్టాలు వ్యక్తులు ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో పనిచేయడానికి అనుమతించనందున ఈ ద్వంద్వ ఉపాధి సమస్య ఉండనే ఉంటుంది. కార్యాలయాలలో మారుతున్న వాస్తవికతకు అను గుణంగా దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఐటీ పరిశ్రమలో...  పనిచేస్తున్న వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంపొందించు కోకుంటే లేదా నవీన సామర్థ్యాలను మెరుగుపరచుకోలేకపోతే, దేశీయ ఐటీ రంగం భారీగా నష్టపోతుంది.

ఒకే సమయంలో అనేక అసైన్‌మెంట్‌లపై పని చేయడం అన్నది ఉద్యోగ ఒప్పందాల సంప్ర దాయ ప్రమాణాలకు భిన్నమైనదిగా పరిగణన పొందవచ్చు. కానీ కోవిడ్‌ మహమ్మారి తరువాత మారిన పరిస్థితులలో కార్యస్థానాన్ని అనువైనదిగా మార్చుకున్నప్పుడు, మూన్‌లైటింగ్‌ అనే సమస్యపై దృక్కోణాన్ని మార్చుకోవడం కూడా అవసరమే. అనువైన పని గంటలు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇప్పుడు పని చేసే రంగానికి ఆమోద యోగ్యమైన విధానం. మూన్‌లైటింగ్‌కి కూడా అంతే సమానమైన ఆమోదం ఇవ్వాల్సిన సమయమిది.


వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top