ఎంత చేయాలో అంత చేశారు!

Sakshi Guest Column By Rachapalem Chandrasekhar Reddy

నివాళి

జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథ రెడ్డి కడుపు నిండినవాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలినవాళ్ళ కోసం రాశారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి అత్యుత్తమ కథలు రాశారు. స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి కూడా ఆయన కథలు నిదర్శనాలు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి పెద్ద చలనం తీసుకొచ్చారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. విరుద్ధ భావజాలం గలవారిపట్ల కూడా గౌరవంగా మాట్లాడేవారు. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే సంస్కారి.

‘మానవతావాదులు కాని వారెవరూ కమ్యూనిస్టులు కాలేరు’ అన్నారు శ్రీశ్రీ  ఒక ఇంటర్వ్యూలో. కులం, మతం, జెండర్, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడమే మానవవాదం. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (10 జూలై 1939– 22 మే 2023) అలాంటి మానవ వాది, మానవతావాది. లేకుంటే ‘అమ్మవారి నవ్వు’ అనే మంచికథ రాసేవారు కాదు. ‘బోధి’, ‘వేర్లు’ నవలికలు రాసేవారు కాదు.

‘శశిశ్రీ’, రహమతుల్లా, షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని లాంటి ముస్లిం రచయితలను, హయాత్‌ అనే ఆచార్యుని సోదరులుగా గౌరవించేవారు కాదు. విశ్వనాథరెడ్డి వ్యవసాయక కుటుంబం నుండి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలిన వాళ్ళకోసం రాశారు. అదే ఆయన మానవత్వం.

మానవతావాది కనుకనే, రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి ‘జప్తు’, ‘విరూపం’, ‘సానుభూతి’ లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష , ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్‌ గొడవల్లో పడి నలిగిపోవడం చూశారు. ఫ్యాక్షన్‌ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిలో రాయలసీమ గౌరవం దెబ్బతింటున్నదని గ్రహించి ‘వెనకా ముందు’ కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటై, వాళ్ళ కోసం పేదలు బలైపోతున్న అమానుషత్వాన్ని ‘పీర్లసావిడి’ కథలో చిత్రించారు. 

నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న సమయం (1973–1977)లో బహుశా 1975 ప్రాంతంలో విశ్వనాథ రెడ్డి పరిచయమయ్యారు. నన్ను ‘చంద్రా’ అని పిలిచేవారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకసారి నన్ను తిరుపతిలో కేతు ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ సమయంలో కేతును గురించి వల్లంపాటి నాతో ‘ఈయన పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తాడు కానీ, పెద్ద రౌడీ’ అన్నారు. అప్పుడు కేతు నవ్వుతూనే ‘చంద్రా! ఆయన మాటలు నమ్మొద్దు’ అన్నారు.

అలా మొదలైన మా పరిచయం నిరాఘాటంగా కొనసాగింది. కేతు మార్క్సిస్టు అయినా, మార్క్సిస్టులు కాని చెరుకు పల్లి జమదగ్ని శర్మ, పేరాల భరత శర్మ వంటి సహాధ్యాపకుల గురించి ఉన్నతమైన మాటలు చెప్పేవారు. ఒకరిని చూస్తే ఇంకొకరికి పడని కాలంలో విరుద్ధ భావజాలం గలవారిపట్ల గౌరవంగా మాట్లా డడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, దానిని మెచ్చుకొని, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే గొప్ప సంస్కారం ఆయనది.

‘నేను చాలా స్లో రైటర్ని’ అని విశ్వనాథరెడ్డి చెప్పుకొన్నారు. సమాజాన్ని దహించి వేస్తున్న రుగ్మతలను సమగ్రంగా మనసులో రూపుకట్టించుకొని రాయడానికి చాలా సమయమే తీసుకొనేవారు. ‘వాన కురిస్తే’ కథలో రైతు పాపయ్య, ఆయన కుటుంబమంతా వానకోసం ఎదురు చూడడంలోనే జీవితాలు గడిచిపోతాయి. కరువు కాలంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే గడ్డిని ఆధిపత్య వాదులు పేదలకు అందకుండా తస్కరించే వాస్తవికతను ‘గడ్డి’ కథలో చిత్రించారు.

ఈ అమాన వీయతను ‘నా బట్టా! నువ్వు రైతు కొంపల్లోనే పుట్టి నావా? కాపోడి వేనా?’ అని ఒక పేద మహిళ నిలదీస్తుంది. ఇలాంటి మాటలు రాయాలంటే రచయిత ‘అ–కులీక రణ’ (డీక్యాస్టిఫై) అయితే తప్ప సాధ్యం కాదు. అకులీకరణ చెందా లన్నా, అవర్గీకరణ చెందా లన్నా రచయిత హృదయంలోని మానవ త్వమే దారి చూపుతుంది. 

పులివెందుల కాలువ వస్తు వుగా ఆర్తితో రాసిన ‘పొడినిజం’ కథలో కరువుతో ఎండిపోయి,పంటలు పండని నేలను ఒక విద్యార్థి దృష్టికోణం నుండి ‘అచ్చరాలు తుడిచేసిన పలకలాగా ఉంది’ అనిపిస్తాడు. పంటలు పండించి బతికే రైతులు కరువు వల్ల సారా వ్యాపారులుగా మారి, పోటీలు పడి, ఆఖరికి ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకర్నొకరు చంపుకొనే అమానుష దశకు చేరుతున్న వాస్తవమే ‘కూలిన బురుజు’ కథ. భారతీయ సమా జంలో వితంతువులు పీడిత వర్గం.

వాళ్ళపట్ల సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ‘ముఖదర్శనం’ కథలో చిత్రించారు.  కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి స్త్రీపక్షపాతి. అలా కాని రచయితలు మానవతా వాదులు కారు. ‘తారతమ్యం’, ‘మారి పోయారు’ వంటికథలు ఆయ నకు స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి నిదర్శనాలు. ‘ఎందరి దయా దాక్షిణ్యాల మీద ఆడవాళ్ళు బతకాలి?’ అని ‘తారతమ్యం’ కథ ప్రశ్ని స్తుంది. ఈ కథ 1977 నాటిది. అప్పటికి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పుట్టలేదు.

డబ్బు కొంతమంది చేతుల్లో ఉండిపోవడాన్ని వేమన వంటి ప్రాచీన కవులే గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం నేర్పిన పాఠాలతో ప్రభావితమైన అభ్యుదయ రచయితలు అసమ ఆర్థిక వ్యవస్థ çసృష్టించే వైరుధ్యాలను బలంగా చిత్రించారు. ‘డబ్బు ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది’ అన్న అవగాహన విశ్వనాథరెడ్డిది. ఈ అవగాహనతో ‘చీకటితప్పు’, ‘దాపుడుకోక’, ‘చెదిరిన గుండెలు’ వంటి విలువైన కథలు రాశారు. ‘దాపుడుకోక’ కథలో చెన్నమ్మ పేదరికం మానవత్వం ఉన్నవాళ్ళను కలవరపరుస్తుంది.

సంపద ఒకరి చేతిలో ఉండే వ్యవస్థలో పీడితులు కూడా సంపద తమ చేతికి వేస్తే, పీడకులుగా ఎలా మారతారో ‘సొతంత్రం’ కథలో సాయమ్మ పాత్ర ద్వారా చూపించారు. మార్క్సిజం వ్యక్తి గత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. ఆ దృష్టి ఈ కథలో కనిపిస్తుంది. ఆయన కథలు చదివితే మన సంస్కారంలో ఒక కదలిక వస్తుంది. వర్తమాన ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద మనల్ని పునరాలోచింప చేస్తాయి.

ప్రజలకు సేవ చేయడానికి ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఉద్యో గులు అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించడాన్ని సహించరు అభ్యుదయ రచయితలు. ‘చక్రబంధం’, ‘పద్ధతి’ (విద్యారంగం), ‘అనధికారం’, ‘ఆ రోజుల్లో వస్తే’, ‘సందాకబళం’, ‘అంతర్ముఖం’ (పోలీసు శాఖ), ‘పారు వేట’ (అటవీ శాఖ), ‘దప్పిక’ (రెవెన్యూ), ‘వైరుధ్యం’ (పంచాయతీ రాజ్‌) వంటి కథల ద్వారా కార్యనిర్వహణ వ్యవస్థలోని అమానుషత్వాలను ప్రతిబింబించారు కేతు.

ప్రాంతాల మధ్య వైరుధ్యాలను కూడా ‘తేడా’, ‘ఒక దృశ్యం– మరొక చిత్రం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. ‘శిలువ వేసిన మనుషులు’ వంటి కథలలో దళితుల జీవితాల లోని దైన్యాన్ని ప్రతిపాదించారు. పల్లెలు, నగరాలు, భారతదేశం, విదేశాలు – వీటి మధ్య తేడాలను ‘రెండు ప్రపంచాల మధ్య’, ‘దగ్గరైన దూరం– దూరమైన దగ్గర’, ‘అంత్యాక్షరి’ వంటి కథలలో కంటికి కొట్టి నట్లు చిత్రించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేతు విశ్వనాథరెడ్డి కథలు పొడినిజాల పట్ల తడిగీతాలు!

కేతు శాస్త్రీయమైన సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ‘కడప ఊర్ల పేర్లు’ అంశం మీద పరిశోధించి, ఓనమాస్టిక్స్‌ అనే ప్రత్యేక అధ్య యన విభాగానికి పునాది వేశారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. ‘దృష్టి’, ‘సంగమం’, ‘పరిచయం’ వంటి గ్రంథాలు ఆయన విమర్శన గాఢతకు నిదర్శనాలు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు వాచకాల్లో విప్లవం తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి విలువైన సంపాదకీయాలు రాసి పెద్ద చలనం తీసుకొచ్చారు. గొప్ప విద్యావేత్త. దూరవిద్యా విధానం మీద ఆయన చేసిన కృషి ‘భాషాబోధన, విద్య– మార్పులు, ప్రాసంగికత’ అనే పుస్తకంగా వచ్చింది. ‘రాయలసీమ రాగాలు’, ‘చదువుకోలేదు’ వంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారం, అజోవిభొ కందాళై పురస్కారం వంటివి ఆయనకు దక్కాయి. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో అంత చేశారు!

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 
వ్యాసకర్త తెలుగు సాహిత్య విమర్శకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top