breaking news
kodavatiganti kutamba rao
-
ఎంత చేయాలో అంత చేశారు!
జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథ రెడ్డి కడుపు నిండినవాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలినవాళ్ళ కోసం రాశారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి అత్యుత్తమ కథలు రాశారు. స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి కూడా ఆయన కథలు నిదర్శనాలు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి పెద్ద చలనం తీసుకొచ్చారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. విరుద్ధ భావజాలం గలవారిపట్ల కూడా గౌరవంగా మాట్లాడేవారు. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే సంస్కారి. ‘మానవతావాదులు కాని వారెవరూ కమ్యూనిస్టులు కాలేరు’ అన్నారు శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూలో. కులం, మతం, జెండర్, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడమే మానవవాదం. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (10 జూలై 1939– 22 మే 2023) అలాంటి మానవ వాది, మానవతావాది. లేకుంటే ‘అమ్మవారి నవ్వు’ అనే మంచికథ రాసేవారు కాదు. ‘బోధి’, ‘వేర్లు’ నవలికలు రాసేవారు కాదు. ‘శశిశ్రీ’, రహమతుల్లా, షేక్ హుస్సేన్ సత్యాగ్ని లాంటి ముస్లిం రచయితలను, హయాత్ అనే ఆచార్యుని సోదరులుగా గౌరవించేవారు కాదు. విశ్వనాథరెడ్డి వ్యవసాయక కుటుంబం నుండి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలిన వాళ్ళకోసం రాశారు. అదే ఆయన మానవత్వం. మానవతావాది కనుకనే, రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి ‘జప్తు’, ‘విరూపం’, ‘సానుభూతి’ లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష , ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్ గొడవల్లో పడి నలిగిపోవడం చూశారు. ఫ్యాక్షన్ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిలో రాయలసీమ గౌరవం దెబ్బతింటున్నదని గ్రహించి ‘వెనకా ముందు’ కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటై, వాళ్ళ కోసం పేదలు బలైపోతున్న అమానుషత్వాన్ని ‘పీర్లసావిడి’ కథలో చిత్రించారు. నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న సమయం (1973–1977)లో బహుశా 1975 ప్రాంతంలో విశ్వనాథ రెడ్డి పరిచయమయ్యారు. నన్ను ‘చంద్రా’ అని పిలిచేవారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకసారి నన్ను తిరుపతిలో కేతు ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ సమయంలో కేతును గురించి వల్లంపాటి నాతో ‘ఈయన పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తాడు కానీ, పెద్ద రౌడీ’ అన్నారు. అప్పుడు కేతు నవ్వుతూనే ‘చంద్రా! ఆయన మాటలు నమ్మొద్దు’ అన్నారు. అలా మొదలైన మా పరిచయం నిరాఘాటంగా కొనసాగింది. కేతు మార్క్సిస్టు అయినా, మార్క్సిస్టులు కాని చెరుకు పల్లి జమదగ్ని శర్మ, పేరాల భరత శర్మ వంటి సహాధ్యాపకుల గురించి ఉన్నతమైన మాటలు చెప్పేవారు. ఒకరిని చూస్తే ఇంకొకరికి పడని కాలంలో విరుద్ధ భావజాలం గలవారిపట్ల గౌరవంగా మాట్లా డడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, దానిని మెచ్చుకొని, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే గొప్ప సంస్కారం ఆయనది. ‘నేను చాలా స్లో రైటర్ని’ అని విశ్వనాథరెడ్డి చెప్పుకొన్నారు. సమాజాన్ని దహించి వేస్తున్న రుగ్మతలను సమగ్రంగా మనసులో రూపుకట్టించుకొని రాయడానికి చాలా సమయమే తీసుకొనేవారు. ‘వాన కురిస్తే’ కథలో రైతు పాపయ్య, ఆయన కుటుంబమంతా వానకోసం ఎదురు చూడడంలోనే జీవితాలు గడిచిపోతాయి. కరువు కాలంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే గడ్డిని ఆధిపత్య వాదులు పేదలకు అందకుండా తస్కరించే వాస్తవికతను ‘గడ్డి’ కథలో చిత్రించారు. ఈ అమాన వీయతను ‘నా బట్టా! నువ్వు రైతు కొంపల్లోనే పుట్టి నావా? కాపోడి వేనా?’ అని ఒక పేద మహిళ నిలదీస్తుంది. ఇలాంటి మాటలు రాయాలంటే రచయిత ‘అ–కులీక రణ’ (డీక్యాస్టిఫై) అయితే తప్ప సాధ్యం కాదు. అకులీకరణ చెందా లన్నా, అవర్గీకరణ చెందా లన్నా రచయిత హృదయంలోని మానవ త్వమే దారి చూపుతుంది. పులివెందుల కాలువ వస్తు వుగా ఆర్తితో రాసిన ‘పొడినిజం’ కథలో కరువుతో ఎండిపోయి,పంటలు పండని నేలను ఒక విద్యార్థి దృష్టికోణం నుండి ‘అచ్చరాలు తుడిచేసిన పలకలాగా ఉంది’ అనిపిస్తాడు. పంటలు పండించి బతికే రైతులు కరువు వల్ల సారా వ్యాపారులుగా మారి, పోటీలు పడి, ఆఖరికి ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకర్నొకరు చంపుకొనే అమానుష దశకు చేరుతున్న వాస్తవమే ‘కూలిన బురుజు’ కథ. భారతీయ సమా జంలో వితంతువులు పీడిత వర్గం. వాళ్ళపట్ల సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ‘ముఖదర్శనం’ కథలో చిత్రించారు. కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి స్త్రీపక్షపాతి. అలా కాని రచయితలు మానవతా వాదులు కారు. ‘తారతమ్యం’, ‘మారి పోయారు’ వంటికథలు ఆయ నకు స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి నిదర్శనాలు. ‘ఎందరి దయా దాక్షిణ్యాల మీద ఆడవాళ్ళు బతకాలి?’ అని ‘తారతమ్యం’ కథ ప్రశ్ని స్తుంది. ఈ కథ 1977 నాటిది. అప్పటికి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పుట్టలేదు. డబ్బు కొంతమంది చేతుల్లో ఉండిపోవడాన్ని వేమన వంటి ప్రాచీన కవులే గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం నేర్పిన పాఠాలతో ప్రభావితమైన అభ్యుదయ రచయితలు అసమ ఆర్థిక వ్యవస్థ çసృష్టించే వైరుధ్యాలను బలంగా చిత్రించారు. ‘డబ్బు ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది’ అన్న అవగాహన విశ్వనాథరెడ్డిది. ఈ అవగాహనతో ‘చీకటితప్పు’, ‘దాపుడుకోక’, ‘చెదిరిన గుండెలు’ వంటి విలువైన కథలు రాశారు. ‘దాపుడుకోక’ కథలో చెన్నమ్మ పేదరికం మానవత్వం ఉన్నవాళ్ళను కలవరపరుస్తుంది. సంపద ఒకరి చేతిలో ఉండే వ్యవస్థలో పీడితులు కూడా సంపద తమ చేతికి వేస్తే, పీడకులుగా ఎలా మారతారో ‘సొతంత్రం’ కథలో సాయమ్మ పాత్ర ద్వారా చూపించారు. మార్క్సిజం వ్యక్తి గత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. ఆ దృష్టి ఈ కథలో కనిపిస్తుంది. ఆయన కథలు చదివితే మన సంస్కారంలో ఒక కదలిక వస్తుంది. వర్తమాన ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద మనల్ని పునరాలోచింప చేస్తాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఉద్యో గులు అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించడాన్ని సహించరు అభ్యుదయ రచయితలు. ‘చక్రబంధం’, ‘పద్ధతి’ (విద్యారంగం), ‘అనధికారం’, ‘ఆ రోజుల్లో వస్తే’, ‘సందాకబళం’, ‘అంతర్ముఖం’ (పోలీసు శాఖ), ‘పారు వేట’ (అటవీ శాఖ), ‘దప్పిక’ (రెవెన్యూ), ‘వైరుధ్యం’ (పంచాయతీ రాజ్) వంటి కథల ద్వారా కార్యనిర్వహణ వ్యవస్థలోని అమానుషత్వాలను ప్రతిబింబించారు కేతు. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను కూడా ‘తేడా’, ‘ఒక దృశ్యం– మరొక చిత్రం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. ‘శిలువ వేసిన మనుషులు’ వంటి కథలలో దళితుల జీవితాల లోని దైన్యాన్ని ప్రతిపాదించారు. పల్లెలు, నగరాలు, భారతదేశం, విదేశాలు – వీటి మధ్య తేడాలను ‘రెండు ప్రపంచాల మధ్య’, ‘దగ్గరైన దూరం– దూరమైన దగ్గర’, ‘అంత్యాక్షరి’ వంటి కథలలో కంటికి కొట్టి నట్లు చిత్రించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేతు విశ్వనాథరెడ్డి కథలు పొడినిజాల పట్ల తడిగీతాలు! కేతు శాస్త్రీయమైన సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ‘కడప ఊర్ల పేర్లు’ అంశం మీద పరిశోధించి, ఓనమాస్టిక్స్ అనే ప్రత్యేక అధ్య యన విభాగానికి పునాది వేశారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. ‘దృష్టి’, ‘సంగమం’, ‘పరిచయం’ వంటి గ్రంథాలు ఆయన విమర్శన గాఢతకు నిదర్శనాలు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు వాచకాల్లో విప్లవం తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి విలువైన సంపాదకీయాలు రాసి పెద్ద చలనం తీసుకొచ్చారు. గొప్ప విద్యావేత్త. దూరవిద్యా విధానం మీద ఆయన చేసిన కృషి ‘భాషాబోధన, విద్య– మార్పులు, ప్రాసంగికత’ అనే పుస్తకంగా వచ్చింది. ‘రాయలసీమ రాగాలు’, ‘చదువుకోలేదు’ వంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, అజోవిభొ కందాళై పురస్కారం వంటివి ఆయనకు దక్కాయి. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో అంత చేశారు! రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త తెలుగు సాహిత్య విమర్శకులు -
నలుపు మందారాల మాన్యం చెల్క
‘అట్టడుగు వర్గాల నుంచి వచ్చే వారు తమ జీవిత సత్యాలను చిత్రించడం ప్రారంభిస్తారు. అప్పుడు, ఈనాడు మనం చూసి మురిసే సాహిత్యం, పేలపిండిలా గాలిలో కలసిపోతుంది’ అన్న కొడవటిగంటి కుటుంబరావు వ్యాఖ్యకు తదనంతర కాలంలో నిలువుటద్దంలా నిలిచారు బోయ జంగయ్య. ‘అట్టడుగు వర్గాల నుంచి వచ్చే వారు తమ జీవిత సత్యాలను చిత్రించడం ప్రారంభిస్తారు. అప్పుడు, ఈనాడు మనం చూసి మురిసే సాహిత్యం, పేలపిండిలా గాలిలో కలసిపోతుంది’. 1955లో కొడవటిగంటి కుటుంబరావు పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నాటికి బోయ జంగయ్య టీనేజ్‌లోకి ప్రవేశించారు. నల్లగొండ జిల్లా పంతంగి (లింగారెడ్డిగూడెం) గ్రామంలో దళిత కుటుంబంలో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో 1942 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు. కొ.కు పలికిన సాహిత్య పరిణామ క్రమానికి తదనంతర కాలంలో జంగయ్య నిలువుటద్దంలా నిలిచారు. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు. అన్ని ప్రక్రియల్లోనూ ప్రముఖుల అభినందనలనూ, పాఠకుల అభిమానాన్నీ పొందారు. తాను చూసిన జీవితానికి వెనుక చోదక శక్తులను పాఠకుల ముందు నిలపడం సాహితీకారునిగా తన బాధ్యతగా భావించారు. జంగయ్య ‘జాతర’ నవల తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అత్యున్నత నవలగా పురస్కారం పొందింది. కేంద్ర దళిత సాహిత్య అకాడెమీ డా.అంబేద్కర్ సాహితీ ఫెలోషిప్ పొందారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రచయితల సంఘాలకు బాధ్యులుగా పని చేశారు. నల్లగొండలోని ఆయన ఇంటి పేరు ‘మాన్యం చెల్క’. ఆ సాహితీ క్షేత్రం నుంచి బోయ జంగయ్య పండించిన పంటలు: ఎలుతురు, పావురాలు అనే కవితా సంపుటాలు; గొర్రెలు, ఎచ్చరిక, దున్న, రంగులు, చీమలు అనే కథా సంపుటాలు. హైద్రాబాద్ స్టేట్‌లో హైద్రాబాద్ వేరు. స్టేట్‌లోని తెలంగాణ వేరు. నిజాం పాలనలో హైద్రాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా పేరుపొందింది. సమస్త ఆధునిక వసతులూ ఇక్కడ ఉండేవి. కుల వివక్షత కనిపించేది కాదు. గ్రామీణ తెలంగాణ వేరు. అక్కడి పాలన మాలీ పటేల్-పోలీస్ పటేల్-పట్వారీ చేతుల్లోనే ఉండేది. గ్రామీణ ప్రాంతం నుంచి తనకు రావాల్సిన ఆదాయాన్ని మాత్రమే పట్టించుకున్న నిజాం, ప్రజల బాగోగుల బాధ్యతను చిల్లరదేవుళ్లకు వదిలేశాడు. జంగయ్య రచనల్లో గ్రామీణ తెలంగాణ కన్పిస్తుంది. పూర్వపు పాలన అవశేషాలు తెలంగాణ పల్లెలను ఎలా పీడిస్తున్నవో వివరించడం కన్పిస్తుంది. ఆధునిక అస్తిత్వ ఉద్యమాలకు పూర్వమే అణగారిన వర్గాల గురించి, ముఖ్యంగా వృత్తికారులు, స్త్రీలు, దళితుల గురించి స్వీయానుభవాల ఆధారంగా రచనలు చేసిన వారిలో బో.జ. ముందువరుసలో ఉంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జంగయ్య పనిచేశారు. ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పల్లెలోని చివరి వరుసలోని చివరి వ్యక్తికి ఎలా చేరుతుంది? శ్రమజీవి సృష్టించిన సంపద ప్రభుత్వానికి ఎలా చేరుతుంది? అనే కీలకమైన పరిణామదశలు ఆయనకు నిత్యానుభవం. అలా అవి తన రచనల్లోకి సహజంగా వచ్చేవి. ఆయన కథలకు రాచకొండ విశ్వనాథశాస్త్రి ముందుమాట రాస్తూ- తాను ఇతివృత్తానికి మించిన శ్రద్ధ శిల్పం కోసం తీసుకుంటాననే విమర్శ ఉందనీ, అందుకు కారణం, ఎలా చెప్పాలి అని ఆలోచించడమేననీ, జంగయ్య కథలు సహజంగా ఉంటాయనీ, అందుకు కారణం ఏమి చెప్పాలి అనే అంశంలో ఆయనకు గల స్పష్టతేననీ కితాబునిచ్చారు. గ్రామాల్లో మూఢనమ్మకాల వెనుక గల రాజకీయాలు, పరస్పర శత్రుత్వాలు, హత్యలకు దారితీసే ఉదంతాలు జంగయ్య రచనల్లో విస్మయం గొలిపే సహజ రీతిలో ఉంటాయి. భార్య వివాహేతర సంబంధానికి ఏమి శిక్ష విధించాలా? అని పంచాయితీ ఆలోచిస్తోంటే, భార్య తాలూకు దుస్తులు, వస్తువులు తీసుకువచ్చి నీకు నచ్చిన వాడితో నీవు వెళ్లు అనే భర్త ‘మనస్సు’ అనే కథలో కన్పిస్తాడు. గిరిజన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించని గ్రామీణ స్వభావాలను తన కథల్లో జంగయ్య ప్రతిభావంతంగా చిత్రించారు. ఆయన తన పుస్తకాల ముఖచిత్రాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఎలుతురు కవితా సంపుటికి హేండ్‌మేడ్ పేపర్‌పై దాసి సుదర్శన్‌తో ముఖచిత్రం వేయించారు. గొర్రెలు కథా సంకలనానికి చంద్ర వేసిన ముఖచిత్రం (అయిదు వేళ్లల్లోని రెండు వేళ్లు... బొటనవేలు-మధ్యవేలు పరస్పరం ఢీకొట్టుకుంటాయి) ఆయన కథలసారాంశాన్ని ఒక్క చూపులో చెప్పిందని విమర్శకులు ప్రశంసించారు. సమాజాన్ని శాసిస్తోన్న రెండు ప్రధాన సామాజిక వర్గాల వెనుక అసలైన శక్తి ఎంకులు-రంగయ్యలేననీ, రెడ్డి-చౌదరి తమ ప్రయోజనాలకోసం ఏకమైనా ఎంకులు-రంగయ్యలు ఒక్కటి కాలేకపోతున్నారనీ డెబ్బయ్యవ దశకంలోనే జంగయ్య విశ్లేషించారు. పక్షులు మసీదులకూ పోతాయి, మందిరాలకూ పోతాయి. మనుషుల మధ్య ఆంక్షలెందుకు? అని ‘పావురాళ్లు’ కవితలో జంగయ్య వేసిన ప్రశ్నకు కాలం సమాధానం చెప్పకపోగా పదును పెడుతోంది! జంగయ్య మాన్యం చెల్కలో మాండలీకాల పంట ఉంది. ప్రచారసాధనాల వలన మనుషులు మాట్లాడే మాటల్లో ఒకానొక కృత్రిమభాష వ్యావహారంలోకి వస్తోన్న వాతావరణంలో జంగయ్య రచనలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పల్లెల్లో వివిధ సమూహాలకు, సామాజిక వర్గాలకు చెందిన మనుషులు మాట్లాడే మాండలీకాలను బోయ జంగయ్య తన రచనలలో వాడారు. జాల - దవ్వు - అబక - గాడ్పు కొట్టిండు వంటి గ్రామీణుల పదాలు ఆయన రచనల్లో మెరుస్తాయి. తన సాహిత్యానికి గైడ్‌గా బోయ జంగయ్య కృతజ్ఞతలు వ్యక్తం చేసిన నోముల సత్యనారాయణ మాటల్లో: ‘జంగయ్య రచనల్లో ఇతి వృత్తానికి శిల్పం చర్మం వలె సహజంగా ఉంటుంది. చాలామంది శిల్పాన్ని కోటులా ధరిస్తారు’. - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్; ఫోన్: 7680950863 - బోయ జంగయ్య అక్టోబర్ 1, 1942 - 7 మే 2016