పాటల తూటాల యోధుడు

Sakshi Guest Column On Poet Suddala Hanmanthu

అక్టోబర్‌ 10న సుద్దాల హనుమంతు వర్ధంతి 

పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్నీ, బలగాన్నీ సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘బాంచెన్‌ దొర కాలు మొక్కుతా’ అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన.

 1910లో నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు తెలంగాణలోని ప్రతి గడపగడపను తట్టి లేపాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ ప్రజోద్యమాలకు ఊతం ఇచ్చేవారు. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు ఆయన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు హెచ్చరించారు. దీంతో హనుమంతు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మోగించాడు.

1944లో 11వ ఆంధ్ర మహాసభ సమావేశాలు భువనగిరిలో జరిగాయి. హనుమంతు వాలంటీర్‌గా పని చేశారు. ఆ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలను విని హనుమంతు పోరాట మార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి మరింత పదును పెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా  1946–51 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు.

‘వెట్టిచాకిరి విధానమో రైతన్న /ఎంత జెప్పిన తీరదో కూలన్న’ అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు. ‘పల్లెటూరి పిల్లగాడ!/ పసులగాసే మొనగాడా!/పాలు మరిసి ఎన్నాళ్ళయిందో’ అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న‘ అంటూ ఆయన పాడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది.

ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి... దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పాటలు తెలంగాణ జనం నాలికల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ఆయన ప్రజల భాషలో యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందనీ, ఫిరంగిలా పేలుతుందనేంతగా ఆనాటి ప్రజల అభిప్రాయం.

రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో ‘మాభూమి’ నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని తెలిసి చెట్టుకొక్కరు పుట్టకొకరుగా జనం పారిపోతున్న క్రమంలో... ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రతో కొడుతూ ‘వేయ్‌ వేయ్‌ దెబ్బకు దెబ్బ’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. 1982 అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ వ్యాధి కారణంగా తన జీవన ప్రస్థానాన్ని ముగించిన హనుమంతు చరిత్రను జాగ్రత్తగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

– అంకం నరేష్
యూఎఫ్‌ఆర్‌టీఐ తెలంగాణ కో–కన్వీనర్

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top