
అభిప్రాయం
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు, ఆ దేశ ప్రథమ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బతికున్నంత కాలం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అయినా ఇతర మతాలు,సంస్కృతులు అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం ఉండేది. జిన్నా మృతి అనంతరం ఈ భావన అంతరించిపోయింది. దేశంలో రాజకీయ–సైనిక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అస్థిరత్వం వేరూనింది. పాకిస్తాన్ బ్రిటిష్ కాలనీ నుంచి ఒక ఆధునిక దేశంగా రూపొందే పరిణామ క్రమాన్ని ఈ పరిస్థితులు దెబ్బతీశాయి.
పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను మూడు ప్రధాన ఇతి వృత్తాలతో వివరించవచ్చు. వీటిలో మొదటిది: అక్కడి రాజకీయ నాయకత్వానికి ఏనాడూ సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచీ అవినీతికి మారుపేర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితి సైనిక జోక్యా నికి తావిచ్చింది. ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పటి వరకు ఇండియాలో 14 మంది ప్రధాని పదవి అలంకరించగా, పాకిస్తాన్ ప్రజలు ఇదే కాలంలో 24 మంది ప్రధానులను చూశారు.
రెండోది: పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగి హింసా యుత రాజకీయాలపై క్రమంగా పట్టు సాధించడం. 1951లో అప్పటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య నుంచి 2022 నవంబర్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం వరకు... ఈ ఘటనలు అన్నీ ఏదో రూపంలో పాక్ సైన్యంతో ముడిపడి ఉన్నాయి.
రాజకీయ వేదిక మీద ప్రాబల్యం సంపాదించే ప్రక్రియలో పాక్ సైన్యం రెండు పద్ధతులు అనుసరించింది. వీటిలో మొదటిది– సైనిక నియంతృత్వం. ఈ పద్ధతిలో పాక్ సైనిక అధిపతులు నిస్సిగ్గుగా రాజకీయ అధికారం హస్తగతం చేసుకుని తమను తాము దేశాధ్య క్షులుగా ప్రకటించుకున్నారు. రాజకీయ సంక్షోభాలను సృష్టించి, వాటిని సాకుగా చూపిస్తూ తాము దేశానికి రాజకీయ సుస్థిరత అందిస్తామంటూ వారీ దుశ్చర్యకు పాల్పడ్డారు. మిలిటరీ జనరళ్లు అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, జియా–ఉల్–హక్, పర్వేజ్ ముషా రఫ్ ఈ పద్ధతిలో రాజకీయ అధికారం చేపట్టారు.
వీరి హయాంలో ప్రధానులు డమ్మీలుగా ఉండేవారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు నుంచీ ఆ దేశ సైన్యానికి కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. వీరి పదవీ కాలం 2 నుంచి 12 ఏళ్లు. ఇదే సమయంలో ఇండియాకు 31 మంది సైనికాధిపతులుగా వ్యవహ రించారు. ఆర్మీ చీఫ్‌గా వీరి పదవీకాలం రెండేళ్లు/ 62 ఏళ్లకు రిటైర్మెంటు నిబంధనకు లోబడి ఉంటుంది.
పాక్ సైన్యం ప్రాబల్యాన్ని జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తిమంతులైన రాజకీయ నాయకులు సవాలు చేశారు. వీరు భారత వ్యతిరేకతనూ, కశ్మీర్ అంశాన్నీ రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం కొనసాగించాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలను తిరిగి అమలులోకి తేవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్మీలోని కొన్ని ఫ్యాక్షన్లు వీరికి మద్దతు ఇచ్చాయి.
అయితే, ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ బలం చూసుకుని సైన్యాన్ని ఖాతరు చేయలేదు. అటువంటి సమయంలో, సైనికాధిపతులు వారిని అధికారం నుంచి తప్పించారు. జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరి తీశారు. బేనజీర్ భుట్టోను హత్య చేశారు. నవాజ్ షరీఫ్‌ను దేశం నుంచి తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు. వీరందరి దుర్గతికీ సైనికాధిపతులే కారకులు.
మూడో చివరి ఇతివృత్తం గురించి ఇండియలో అంతగా చెప్పుకోం. పాకిస్తాన్ రాజ్యాంగం నిరంతరం సవరణలకు గురయ్యింది. తద్వారా అక్కడి రాజకీయ–సైనిక సంబంధాలను అవి ప్రభావితం చేశాయి. పాకిస్తాన్ సైన్యం రబ్బర్ స్టాంపు అధ్యక్షుల ద్వారా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయించి తాజా ఎన్నికలు జరిపించేది. సర్వసాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యానికి అను కూల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేవి.
1987లో అప్పటి అధ్యక్షుడు జియా–ఉల్–హక్ దేశాధ్యక్షుడికి (అంటే తనకు) నేషనల్ అసెంబ్లీని రద్దు చేసే విశేష అధికారాన్ని కట్టబెడుతూ రాజ్యాంగానికి 8వ సవరణ చేశారు. బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్‌లు ప్రధానులుగా పదేళ్ల సుదీర్ఘ పౌరపాలన అందించిన కాలంలో రాజ్యాంగానికి 13వ సవరణ తీసుకువచ్చారు. 1997 నాటి ఈ సవరణతో 1987 నాటి 8వ సవరణ రద్దు అయ్యింది. ఇలా అధ్యక్షుడి తోక కత్తిరించారు.
తరువాతి దశాబ్దంలో ఆర్మీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2001లో, మూడేళ్లు సైనికాధిపతిగా పనిచేసిన అనంతరం, ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధికారంలో కొన సాగేందుకు అతడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. చిట్టచివరకు 2008లో అభిశంసన నుంచి తప్పించుకోవడానికి పదవికి రాజీనామా చేశారు.
ముషారఫ్ అనంతరం, 2010లో 18వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ సవరణ సైతం సైన్యం అధికారాలను బలహీనం చేయలేక పోయింది. ఇటీవలి సంవత్సరాల్లో జనరల్ కమర్ బాజ్వా వంటి సైనికాధిపతులు పౌర అధికారానికి లోబడి ఉన్నట్లు నటిస్తూ, తెలివిగా అధికారం చలాయించాలని ప్రయత్నించారు. బాజ్వా తర్వాతి వాడు జనరల్ అసీమ్ మునీర్. జనరల్ జియా మూసలో ర్యాడికలైజ్ అయిన మునీర్ పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను సరికొత్త స్థాయికి దిగజార్చారు.
ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) అర్జున్ సుబ్రమణియం
వ్యాసకర్త మిలిటరీ హిస్టారియన్, రిటైర్డ్ ఫైటర్ పైలట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)