ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేనా?

Sakshi Guest Column On India Economic system By ABK Prasad

రెండో మాట 

బ్రిటిష్‌ వలస పాలకులు కూడా పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నామని కోతలు కోసేవారు. అవే మాటల్ని దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా చెప్పింది. అవే ఇప్పటికీ కేంద్ర పాలకులు చెబుతారు. ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు. కానీ ఈ రాజకీయవేత్తలకు తమ ‘అమాయక మనస్తత్వం’ నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకు అందనంత పెద్ద జబ్బు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. రూ. 2 కూడా చేతిలో ఆడని అసంఖ్యాక కష్టజీవులకు దీనివల్ల కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది?

‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కారణం – ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొలదిమంది సంపన్న స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోరికలేనని మరచిపోరాదు.... దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా తాను పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నానని బీరాలు పలకవచ్చు. కానీ, బ్రిటిష్‌ వలస పాలకులు కూడా అలాంటి కోతలే కోసేవారు. కానీ అసలు రహస్యం – పేద ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరక పోవడం. ఈ సత్యాన్ని స్వతంత్ర భారత పాలకులు వినమ్రతతో అంగీకరించి తీరాలి.’’                
– జాతిపిత గాంధీజీ (1947 డిసెంబర్‌ 11); ‘ది హిందూ’ ప్రచురించిన ‘మహాత్మాగాంధీ: ది లాస్ట్‌ 200 డేస్‌’ నుంచి.

‘‘సంపన్నుల చేతిలో అంత అధికారం ఎలా గూడు కట్టుకుంది? పాలకులు ప్రయివేట్‌ కార్పొరేషన్ల పైన, సంపన్నుల ఆస్తుల పైన శ్రుతి మించిన ఆదాయంపై విధించే పన్నుల్ని తగ్గించి వేయడంవల్ల! మరోవైపున శ్రమజీవులైన కార్మిక సంఘాలను అణచి వేయడం ద్వారా వారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం ద్వారా కోత పెట్టేయడం రివాజుగా మారింది.’’                          
– ప్రసిద్ధ ఆర్థికవేత్త పాల్‌ క్రూగ్‌మన్‌

2016లో అకస్మాత్తుగా బీజేపీ పాలకులు పెద్ద నోట్ల చలామణీని అదుపు చేసి దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడుతామని బీరాలు పలికి తాము చతికిలపడటమే గాక కోట్లాదిమంది సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు తేరుకోలేదు. ఈలోగానే ‘పెద్ద నోట్ల భారం’ పేరిట వాటిని చలామణీ నుంచి ఉపసంహరించే పేరిట గతంలో 500, 1000 నోట్లకు ఎసరు పెట్టినట్టే ఇప్పుడు రూ. 2000 నోట్లపై యుద్ధం ప్రకటించారు. 2016లో ‘పాకిస్తాన్‌పై యుద్ధం కోసం’ పెద్ద నోట్ల చలామణీని అదుపు చేస్తే, ఈ రోజు దాకా తేరుకోకుండా కునారిల్లుతూ వస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు.

సామాన్య ప్రజాబాహుళ్యం మౌలిక ప్రయోజనా లకు రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రత్యక్షంగా నష్టం కలగక పోవచ్చు. అయితే పరోక్షంగా ఎన్నికల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీలతో అనుసరించే ఎత్తుగడల నుంచి మాత్రం రెండువేల రూపాయల నోటు తొలగిపోదు. లోపాయకారీగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కేవలం పాలకపక్ష నాటకంగా పైకి కనిపించినా, పరోక్షంగా ప్రతిపక్షాల ప్రయోజనాలు నెరవేర్చడంలో కూడా ‘రెండు వేల నోటు’ ఉపయోగపడుతుందని మరచిపోరాదు. 

గతంలో రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు వల్ల ‘నల్ల ధనం, నకిలీ నోట్లు’ చలామణీ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఏళ్ల తరబడిగా తలదాచుకుంటున్న భారత పెట్టుబడి దారుల దొంగ డబ్బును దేశానికి తీసుకొచ్చి, భారత ప్రజలకు లక్షలు, కోట్లు పంచిపెడతానన్న ప్రధాన మంత్రి మాట ‘నీటి మూట’గా ఎలా మారిందో ప్రజలు చూశారు.

ఈ సందర్భంగా నాటి రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ రాజన్‌ పాలకుల నిర్ణయాల్ని నిరసించి, ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం’లోకి పాలకులు నెట్టబోతున్నారని ప్రజల్ని హెచ్చరించి మరీ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసి అమెరికాలో కొలువుకి ‘చెక్కేయ’వలసి వచ్చింది. రాజన్‌ హెచ్చరికలు దేశానికి ముందస్తు మెలకువలయ్యాయి. అయినా పాలకులలో చలనం లేదు. సుప్రీం కోర్టు కూడా ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న’ తీవ్ర నిరాశను బాహాటంగానే వ్యక్తం చేసింది.

ఆసియా, ఆఫ్రికా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు స్వతం త్రంగా, ఎలాంటి ‘ఉచ్చులు’ లేకుండా బతకవచ్చునో జూలియస్‌ నైరేరి అధ్యక్షతన ఏర్పడిన ‘సౌత్‌ కమిషన్‌’ నిరూపించింది (1990 రిపోర్టు). కాంగ్రెస్‌ హయాంలో ప్రధాని హోదాలో నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ఆ రిపోర్టును ఆహ్వానించి కూడా ఆచరణలో అమలు చేయలేకపోయారు.

ఇదిలా ఉండగా – ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అన్నార్తులైన ప్రజాబాహుళ్యంపై ఎక్కుపెట్టిన దారి దోపిడీ పద్ధతుల వల్ల ఆయా ఖండాల ప్రజలు ఎలా ఆర్థికంగా కునారిల్లి పోయారో ఆ సంస్థల ఆదేశంపై వాటి తరఫున ఆ దేశాలలో పని చేసిన వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిసన్‌ బుధూ తన అనుభవాలను అమితమైన దుఃఖంతో అక్షరబద్ధం చేశారు. ‘‘ఈ ఖండాలలో కోటానుకోట్ల పేద ప్రజలు పట్టెడన్నం కోసం మాడుతున్నారు. అన్నార్తుల రక్తంతో తడిసిన మా అధికారుల చేతులను కడగటానికి ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ చాలవు’’ అని ప్రకటించారు!

‘రూ. 2000’ పెద్ద నోటును సర్క్యులేషన్‌ నుంచి కట్టడి చేసినంత మాత్రాన రూ. 2లు కూడా చేతిలో ఆడని అసంఖ్యాక సామాన్య కష్టజీవులకు కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర పాలకులు కొత్త వేషానికి గజ్జె కట్టారు.

కర్ణాటక తాజా ఎన్నికల్లో రెండువేల రూపాయల కట్టలు ప్రాణం పోసుకున్నందువల్ల 2024 ఎన్నికల నాటికన్నా ఈ కట్టల్ని ‘కట్టడి’ చేయాలన్నది కేంద్ర పాలకుల ఎత్తుగడ! అసలు ‘మంచి పాలన’ పేరిట దేశ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు అని నిశితమైన ఆర్థిక వ్యవహారాల నిపుణులలో ఒకరైన సంజీవి గుహన్‌ ఖండించవలసి వచ్చింది.

వరల్డ్‌ బ్యాంక్‌ చరిత్రకారులైన ఎడ్వర్డ్‌ మాసన్, రాబర్ట్‌ ఆషర్‌ అభిప్రాయం కూడా అదే! అంతేగాదు, బీజేపీ పాలకుల నిర్ణయాలను ‘ఆదర్శం’గా భావించిన ఒక ‘నేత’ మరొక అడుగు ముందుకు వేసి – ప్రతిపక్షాల కూటమికి తనను రథసారథిని చేస్తే మొత్తం ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని అన్నట్టుగా ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌లో బాహాటంగా ప్రకటించడంతోనే – రెండు వేల రూపాయల నోటుకు ‘వేటు’ పడిందని కొల్లలుగా ప్రకటనలు వెలువడజొచ్చాయి.

ఈ సందర్భంగా రాజకీయ పాలకుల, నాయకుల తప్పిదాలకు మూలాన్ని కనుగొనే యత్నంలో ఐన్‌స్టీన్‌కూ, సోషలిస్టు నాయకుడు రావ్‌ుమనోహర్‌ లోహియాకూ మధ్య సాగిన ఒక ఆసక్తికరమైన సంభా షణను గమనించాలి. ఐన్‌స్టీన్‌: ‘రాజకీయులు చేసే తప్పిదాలు వాళ్ల లోని చెడ్డ తలంపుల వల్లగాక, అమాయకత్వం నుంచి పుట్టే లక్షణంగా మనం భావించవచ్చా?’

లోహియా: ‘అసలు రహస్యం – రాజకీయవేత్తలకు తమ అమా యక మనస్తత్వం నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకి అందనంత పెద్ద జబ్బు. ఆ జబ్బే వారిని పీడిస్తుండే పెద్ద రోగం. ఈ రోగం నుంచి బయట పడటం ఇష్టం లేనందుననే చాలా మంది రాజకీయులకు దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు గాక ఉండదు’!

ఆర్థిక నిపుణులైన శుభదారావు నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్థికవేత్తల బృందం (క్వాంట్‌ ఎకో) వివరించినట్టుగా, పన్నుల ఎగ వేతకు వీలుగా దొంగచాటుగా అట్టిపెట్టుకోవడానికి ఈ 2000 లాంటి పెద్ద నోట్లు సంపన్నుల వద్ద మేట వేసుకున్నాయి. అవి ఇప్పుడు కోట్లాది విలువ చేసే లోహ సంపద పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గతంలో బ్యాంకుల వద్ద పొద్దుగూకులు పెద్ద నోట్లు మార్చుకోవడానికి పడిగాపులు పడి 125 మంది సాధారణ ఖాతాదార్ల  ప్రాణాలు ‘హరీ’ అన్నాయి. ఈసారి ‘భాగోతం’ ఎలా ముగుస్తుందో రేపటి ‘వెండి తెర’పై చూడాల్సిందే!
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top