Bilkis Bano Case: వారి విడుదల దేనికి సంకేతం?

Remission Granted to Bilkis Bano Case Convicts Raise Questions - Sakshi

గుజరాత్‌కు చెందిన బిల్కిస్‌ బానోపైనా, ఆమె కుటుంబం పైనా సామూహిక లైంగిక దాడి, హత్యాచారం కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. ఆ ఖైదీలకు మనువాదులు స్వాగత సత్కారాలు చేయడం సభ్య సమాజానికి పుండు మీద కారం చల్లినట్టయ్యింది. 2002 గుజరాత్‌ అల్లర్ల సందర్భంలో మనువాద మూకల దాడులను తప్పించు కోవడానికి ప్రయత్నించిన ముస్లిం కుటుంబాన్ని పొలాల్లో వేటకుక్కల్లా వేటాడారు. ఒకే కుటుంబంలో ఏడుగురిని క్రూరంగా చంపేశారు. తల్లీ బిడ్డలను లైంగిక దాడి చేసి హత్య చేశారు. అదే ఘటనలో లైంగిక దాడికి గురైన ఐదు నెలల గర్భవతి బిల్కిస్‌ బానో చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 

బిల్కిస్‌ బానో సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసింది. ఈ కేసు విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ముందు జాగ్రత్తలో భాగంగా గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు కేసు బదిలీ అయింది. సీబీఐ కోర్టు ఆరేళ్ల విచారణ తర్వాత నేర నిర్ధారణ చేసి 2008 జనవరి 21న ఈ అమానవీయ కాండలో పాల్గొన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది. దీనిని ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. వచ్చే ఏడాది గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.  విడుదలకు నిర్ణయం తీసుకునే క్రమంలో 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పట్టించుకోలేదు. సీబీఐని సంప్రదించలేదు. సలహాలు తీసుకోలేదు. 

ఈ ఖైదీల విడుదలను మూక దాడులు చేసే విచ్ఛిన్నకర, ఉన్మాద శక్తులకు భరోసా కల్పించే చర్యల్లో భాగంగా చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలను నయానో భయానో లొంగదీసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నమే ఇది. జైలు నుంచి విడుదలైన ఉన్మాద మూకను విశ్వహిందూ పరిషత్‌ వాళ్లు, ఇతర మనువాదులు పూలమాలలతో స్వాగతించారు. సన్మానాలు చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలతో రాఖీలు కట్టించారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఎర్రకోట నుంచి ఏలికలు నారీ శక్తి గురించి ప్రగల్భాలు పలుకుతున్న సమయంలోనే ఈ నేరస్థుల విడుదల దేనికి సంకేతంగా నిలుస్తోంది?  (క్లిక్‌: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)

ఇప్పటికే ఆరు వేల మంది పౌరులు, మహిళ సంఘాలు, హక్కుల కార్య కర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ‘న్యాయం పట్ల మహిళల విశ్వాసాన్ని పెంపొందిస్తూ 11 మంది దోషులకు రెమిషన్‌ రద్దుచేయాలనీ, వారిని తిరిగి జైలుకు పంపాల’నీ ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని బిల్కిస్‌ బానో కలలో కూడా ఊహించి ఉండదు. బాధితురాలి ప్రాణాలకు, ప్రశాంతతకు ప్రమాదం పొంచి ఉంది. అందుకే ‘నా ఒక్క దాని కోసమే కాదు, న్యాయ స్థానాల్లో న్యాయం కోసం పోరాడు తున్న మహిళలందరి కోసం... ప్రశాంతంగా, నిర్భయంగా జీవించే నా హక్కును తిరిగి ఇవ్వాలి’ అని వేడుకుంటోంది. ఆమె కోరిక అత్యాశ అవుతుందేమో!? 

– మామిండ్ల రమేష్‌ రాజా
తెలంగాణ కార్యదర్శి, సీపీఐ(ఎమ్‌ఎల్‌) లిబరేషన్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top