మార్పునకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమా?

Political Crisis In Congress Party Needs To Be Leadership Change - Sakshi

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థేనని ప్రముఖ ఎన్నికల పండితులు నొక్కి చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల సర్వే కూడా అదే చెబుతోంది. 2014లో మోదీ ఆధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక స్థితి దిగజారిపోయిందనో, ఏమీ మారలేదనో అత్యధిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కూడా ఎంతోమంది అంటున్నారు. తమ ఆర్థిక పరిస్థితి పట్ల ప్రజల్లో ఇంతటి తీవ్ర నిరాశాభావం దేశంలో రానున్న మార్పును సంకేతిస్తోంది.

కానీ కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతుందా? గాంధీ కుటుంబేతర  నాయకుడికి అధ్యక్ష పగ్గాలు అప్పజెబుతుందా? ఒకవేళ అప్పజెప్పినా స్వేచ్ఛగా పనిచేయగలిగే వీలు కల్పిస్తుందా? వీటన్నింటికీ ఆశావహ సమాధానాలు దొరికితే గనక, ఈ కొత్త అధ్యక్షుడి హయాంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగితే భారీ రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీలో సమూల మార్పు ఆ పార్టీకే కాకుండా దేశానికే ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. 

గులామ్‌ నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన నాటకీయ రాజీనామా ఇప్పటికే సాగుతున్న ప్రక్రియను మరింత ముందుకు నెడుతుందా? మన ప్రజాస్వామ్యానికి కీలకమలుపు తీసుకురానున్న కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న గణనీయమైన మార్పు అవకాశం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. రెండు వాస్తవాల వల్ల ఇది ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కృత నిశ్చయంతో ఉంది. ఈ పోటీలో సోనియాగాంధీ కుటుంబీకులు ఎవరూ పోటీ చేయడం లేదు. కాబట్టి దీని ప్రతిఫలంగా ఒక ఉత్తేజ కరమైన, విశ్వసనీయమైన, బహుశా జనరంజకమైన జాతీయ ప్రతిపక్షం ఆవిర్భవించడాన్ని మనం చూడవచ్చా?

బహుశా నేను ఈ విషయంలో రెండు ఊహలపై ఆధారపడు తున్నాను. మొదటిది: స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నిక ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. కాంగ్రెస్‌ సభ్యులు ఎవరైనా ఈ ఎన్నికలో పోటీ చేయడానికి రంగం సిద్ధమవు తోంది. ఇది ఎన్నికలపరంగా ప్రతిభకు, రాజకీయ సున్నితత్వానికి, విస్తృతమైన బహిరంగ ప్రజా నివేదనకు ఆస్కారమిస్తోంది. పైగా బీజేపీని సవాలు చేయగల గొప్ప వక్తను బహూకరించడమే కాదు... భారతీయ ఓటరుకు అర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ప్రతిపాదిస్తోంది. రెండు: అధ్యక్షుడిగా గెలిచే వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీలో తాను ఆలోచిస్తున్న విధంగా సమూల మార్పులు చేసే స్వేచ్ఛను కలిగి ఉంటారు కూడా! అదే సమయంలో గాంధీలు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాకుండా నూతన అధ్యక్షుడికి ప్రోత్సాహం, మద్దతు అందించే స్థానంలో ఉంటారు. గులామ్‌ నబీ ఆజాద్‌ రాజీనామా తర్వాత బహుశా కాంగ్రెస్‌ పార్టీ ఈ విధంగా మాత్రమే బతికి బట్ట కడుతుంది.

అయితే నా వివేకం సూచిస్తున్న సానుకూల అవకాశాలతో పోలిస్తే నా అంచనాలు తప్పు అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండ వచ్చు కూడా! అదేమంటే గాంధీయేతర అధ్యక్షుడిని కాంగ్రెస్‌ పార్టీ చక్కగా ఎంపిక చేసుకోవచ్చు కానీ, గాంధీ కుటుంబం ఆయనకు స్వేచ్ఛగా పనిచేయగల, మాట్లాడగల, వ్యూహాన్ని మార్చివేయగల స్వాతంత్య్రాన్ని ఇస్తుందా? అలాగే తాను కోరుకుంటున్న పొత్తుల కోసం ప్రయత్నించే స్వాతంత్య్రాన్ని ఇస్తుందా? కాంగ్రెస్‌ పార్టీ శ్రేయస్సు, మన ప్రజాస్వామ్య శ్రేయస్సు రీత్యానే కాకుండా దేశ భవి ష్యత్తు కోసం కూడా గాంధీ కుటుంబం అలాంటి అవకాశం ఇస్తుందని మాత్రమే నేను ఆశించగలను.

2024 ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినగలదని సూచించడానికి గణనీ యమైన సాక్ష్యం ఉందని చెబుతున్నాను. సమర్థుడైన, బాధ్యతా యుతమైన అధ్యక్షుడి నాయకత్వం కింద పునరుజ్జీవం పొందే కాంగ్రెస్‌ పార్టీ, ఎన్నికల ఫలితాన్నే నిర్ణయించగలిగేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలదు. ‘ఇండియా టుడే’ ఇటీవలే నిర్వహించిన ‘జాతి మనోగతం’ సర్వే నుంచి దీనికి సరైన సాక్ష్యం లభిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి భారత ప్రజల తీవ్ర ఆందోళనను, వేదనను కూడా ఈ తాజా సర్వేప్రతిబింబించింది. మనలో మెజారిటీ ప్రజలకు ఇదే ప్రస్తుతం విలువైన అంశంగా ఉంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సమస్యలే అని 69 శాతం మంది గుర్తించారు. దేశ పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుందనీ, లేదా కనీసం మెరుగుపడదనీ ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో 57 శాతం మంది నమ్ముతున్నారు. పరిస్థి తులు మెరుగవుతాయని నమ్ముతున్న వారికంటే మెరుగుపడవని నమ్మే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక స్థితి దిగజారిపోయిందని, లేక ఏమీ మారలేదని 67 శాతం మంది చెప్పారు. తమ పరిస్థితి మోదీ వచ్చాక మెరుగుపడిందని 28 శాతం మంది మాత్రమే చెప్పారు. పైగా దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉందని, లేదా ఎంతో కొంత తీవ్రమైన స్థితిలో ఉందని 73 శాతం మంది భావించారు. ఇందులో 56 శాతం మంది అయితే నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబ ఆదాయం తగ్గిపోయిందని లేదా మెరుగుపడలేదని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను గమనించినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత బలహీనమైన స్థితిలో ఉందని కనిపించడం లేదా?

బహుశా మన అత్యంత గౌరవనీయులైన (మాజీ) ఎన్నికల పండితుడు యోగేంద్ర యాదవ్‌ చెబుతున్నదాన్ని బట్టి సందేశం చాలా స్పష్టంగా ఉంది. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థేనని ముమ్మార్లు ఆయన నొక్కి చెప్పారు. తమ ఆర్థిక భవిష్యత్తు గురించి సాంప్రదాయికంగానే భారతీయులు చాలా ఆశావహ దృక్పథంతో ఉంటారు. కానీ తమ ఆర్థిక పరిస్థితి పట్ల ఇంత తీవ్ర నిరాశాభావం దేశంలో రానున్న మార్పును సంకేతిస్తోందనీ, వ్యూహాత్మకంగా సరైన రీతిలో నిర్వహించగలిగితే దేశంలో భారీ రాజకీయ మార్పునకు ఇది దారి తీస్తుందనీ మనం గ్రహించవచ్చు.

అయితే, దేశంలో రెండో నాటకీయ మార్పు కూడా ఇప్పటికే చోటు చేసుకుందని ‘ఇండియా టుడే’ పోల్‌ సూచిస్తోంది. అదేమిటంటే ఈసారి మోదీ ప్రభుత్వ ప్రజాస్వామిక విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. భారత్‌లో ప్రస్తుత ప్రజాస్వామ్య స్థితి గురించి మీరేమనుకుంటున్నారు అని ‘ఇండియా టుడే’ పోల్‌లో ప్రశ్నించి నప్పుడు– 48 శాతం మంది ప్రమాదకరంగా ఉందని నమ్ముతుం డగా, 37 శాతం మంది ప్రజాస్వామ్యానికి ప్రమాదమేమీ లేదని చెప్పారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడుతోందని నమ్మేవారి సంఖ్య ఈ సంవత్సరం జనవరి నుంచి దాదాపు 10 శాతం పెరిగింది.

అదే సమయంలో ప్రజాస్వామ్యం చక్కగా ఉందని చెప్పినవారి సంఖ్య దాదాపు 20 శాతం పడిపోయింది. ఈరోజు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనో, లేదనో చెబుతున్న వారి మధ్య ఆంతరం ఆశ్చర్యకరంగా 11 శాతం మాత్రమే. మరోసారి చెబుతున్నాను, విశ్వసనీయుడైన కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు పార్టీని ఈ అంశంపైనే నిర్మించగలడు. పైగా మరో విషయం గుర్తుపెట్టుకోవలసి ఉంది. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలో అతడు గెలిచి, అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఉండే పార్టీకి ప్రాతినిధ్యం వహించగలిగితే, అది అతడి స్థానాన్ని మరింతగా బలపర్చగలదు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఈ అవకాశం మరీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే రానున్న 20 నెలల కాలంలో మోదీ, బీజేపీ తమ పట్ల ప్రజల్లో ఉంటున్న ఈ వ్యతిరేక అవగాహనను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడే గాంధీలు పక్కకు తొలగి, వారి వారసుడికి పూర్తి అవ కాశాలను కల్పించి తీరాలి. బహుశా, కేవలం బహుశా, ఆజాద్‌ నిష్క్ర మణ వల్ల గాంధీ కుటుంబం ఇది చేస్తుందనే నమ్మకం కలిగిస్తోంది. లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఇలాగే బద్ధకంగా, నిస్తేజంగా ఉంటూ, కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటుంది.


కరణ్‌ థాపర్‌, వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top