కనీస వేతనాలు ఇలాగేనా?

KR Syam Sundhar Article On Minimum Wages - Sakshi

విశ్లేషణ

వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్‌–19తో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం జూన్‌ 3న అధికారిక ప్రకటన చేస్తూ, కనీస వేతనాలు, జాతీయ స్థాయి కనీస వేతనాల స్థిరీకరణపై సాంకేతిక ప్రతిపాదనలు, సిఫార్సులు అందించడానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ డైరెక్టర్, ప్రొఫెసర్‌ అజిత్‌ మిశ్రా అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. ప్రకటన చేసిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ కమిటీ అమలులో ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ స్పందన అనేక కారణాల రీత్యా ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీ కాల వ్యవధిని మూడేళ్లుగా నిర్ణయించడం ఇందులో కీలకమైంది. శ్రామికులపై రెండో నేషనల్‌ కమిషన్‌ లేదా అసంఘటిత రంగంలో వ్యాపార సంస్థలపై జాతీయ కమిషన్‌ వంటి పలు కీలక అంశాలపై విచారణ జరిపే కమిషన్‌కు మాత్రమే ఇన్నేళ్ల కాల వ్యవధిని నిర్ణయిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కనీస వేతనాలను నిర్ణయించే కమిటీకి ఇంత సుదీర్ఘ కాలవ్యవధిని నిర్ణయించడమే ఆశ్చర్య హేతువుగా ఉంది. 

కాకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అర్థవంతం చేస్తూ మిశ్రా కమిటీ తన కార్యాచరణ పరిధికి సంబంధించిన ప్రత్యేక నిబంధలపై వివరణ ఇచ్చేంతవరకు మనం వేచి ఉండాలి. ఈ మధ్య కాలంలో నాలుగు కీలక అంశాలను మాత్రం చర్చించాల్సి ఉంది. వాటికి పరిష్కారాలు సూచించాల్సి ఉంది. 1. మిశ్రా కమిటీ నియామకానికి దారితీసిన సందర్భం ఏమిటి? 2. ప్రస్తుతం ఉన్న కమిటీలకు ఇది స్వాగతించాల్సిన అదనపు చేర్పుగా ఉంటుందా? 3. కఠినమైన న్యాయాదేశం వెలుగులో ఈ కమిటీ కనీస వేతనాల విషయంలో అందించే చేర్పు ఏమిటి? 4. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఫలితాలు ఎలా ఉంటాయి?

వేతన నియమావళి తొలి ముసాయిదాను 2017 ఆగస్టు 10న సమర్పించారు. తర్వాత సవరించిన నియమావళిని 2019లో ఆమోదించారు. వీవీ గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫెలో డాక్టర్‌ అనూప్‌ శతపథి (ఇకపై శతపథి కమిటీ అని పేర్కొందాం) అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని 2018 జనవరి 17న ఏర్పర్చింది. కనీస వేతనాలపై సమగ్ర సమీక్ష జరపడం.. జాతీయ, ప్రాంతీయ కనీస వేతనాలను సిఫార్సు చేయడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా కనీస వేతనాల అమలు తీరును దృష్టిలో ఉంచుకుని, భారతీయ నేపథ్యంలో వాటిని స్వీకరించడంపై కమిటీ అధ్యయనం చేస్తుంది.

శతపథి కమిటీ 2019లో ఒక సమగ్ర  నివేదికను సమర్పించింది. భారత్‌లో కనీస వేతన విధాన చరిత్ర, కనీస వేతనాల వ్యవస్థకు సంబంధించిన ఐఎల్‌ఓ విధానం, పలు దేశాల్లో కనీస వేతన వ్యవస్థలు వంటి అనేక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా చర్చించింది. పర్యవసానంగా, జాతీయ స్థాయిలో రోజుకు రూ. 375ల కనీస వేతనాన్ని, నెలకు రూ. 9,750ల వేతనాన్ని ఇవ్వవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసింది. దేశంలోని అయిదు రీజియన్లకు గాను ప్రాంతీయ వారీ వేతనాలను స్థిరపర్చాలని పేర్కొంది.

అయితే ఈ నివేదికలోని కొన్ని అంశాలకు కార్మిక సంఘాలు మద్దతిచ్చినప్పటికీ మొత్తంగా చూస్తే నివేదికపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లోని చాలా కార్మిక సంఘాలు ఏడవ పే కమిషన్‌ సిఫార్సు చేసిన వేతన రేట్ల ప్రకారం జాతీయ స్థాయిలో రోజుకు 600 రూపాయల కనీస వేతనాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశాయి. యాదృచ్ఛికంగా శతపథి కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలపై ఏదైనా చర్చ చేసిందీ లేనిది పేర్కొనలేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రోజువారీ కనీస వేతనాన్ని రూ. 176ల నుంచి 178 రూపాయలకు కనిష్టంగా మాత్రమే పెంచుతున్నట్లు నిర్ణయిం చింది. ఈ నిర్ణయాన్ని శతపథి కమిటీ తిరస్కరించినట్లు కనిపిస్తోంది. కానీ తర్వాత కేంద్రం నియమించిన మిశ్రా కమిటీ ఇదే శతపథి కమిటీ చేసిన సిఫార్సులను తిరస్కరించడం గమనార్హం.

మిశ్రా కమిటీలో ప్రభుత్వ ప్రతినిధుల పాత్ర సందేహాస్పదం
మిశ్రా కమిటీలో ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధుల నియామకం కాస్త అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే వీరి వల్ల కనీస వేతనాల రేట్లకు సంబంధించి అంతవరకు చేసిన ప్రతిపాదనలను కుదించే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శతపథి కమిటీ కానీ, మరో కమిటీ కానీ ద్రవ్యోల్పణానికి అనుగుణంగా చేసిన సిఫార్సులకంటే తక్కువ కనీస వేతనాన్నే తాజాగా ప్రతిపాదించాలని మిశ్రా కమిటీపై ఒత్తిడి చేసి ఉండవచ్చని అనుమానించవచ్చు కూడా. మొత్తం మీద చూస్తే మిశ్రా కమిటీ పేరుకు స్వతంత్ర ప్రతిపత్తిని ఆస్వాదిస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ప్రభుత్వ ప్రతినిధులు ప్యానెల్‌లో చేరడం వల్ల ప్రభుత్వ నిర్ణయమే అమలు జరగవచ్చని స్పష్టమవుతోంది.

దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కూడిన ఐఎల్‌ఓ అధికారులకు కనీస వేతనాలపై నిర్ణయ బాధ్యతను ఇచ్చి ఉండవచ్చు. భారత్‌లోనూ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనీస వేతనాలపై కొంతమంది ఐఎల్‌వో అధికారులు విశేషమైన కృషి చేశారు. కాబట్టి వీరితో పోలిస్తే మిశ్రా కమిటీని నిపుణుల కమిటీ అని పిలవడం తప్పిదమే అవుతుంది. అయితే కమిటీలోని సాంకేతిక సభ్యుల విద్యార్హతలను నేను ప్రశ్నించను. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందన్నదానితో పనిలేకుండా భారతీయ రాజ్యవ్యవస్థ వివిధ కమిటీలను, కమిషన్లను నియమించడం, తర్వాత అవి సమర్పించే నివేదికలను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. శతపథి కమిటీ నివేదికకు కూడా అదే గతి పట్టింది. 2024 జూ¯Œ లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉన్న మిశ్రా కమిటీకి సైతం అదే గతి పట్టబోదనే గ్యారంటీ ఏమిటి?

కమిటీల నివేదికలు.. వాస్తవ ప్రతిఫలనాలు
వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్‌–19 భయానక ప్రభావం, ఆర్థిక మందగమనం దీనికి కారణం కావచ్చు. కానీ అదే సమయంలో సంఘటితరంగం, అసంఘటిత రంగంలోని కార్మికులు నిజాదాయాల మాట పక్కనబెడితే, ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం శాసనేతరపరంగా ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. అదే సమయంలో కోవిడ్‌ కారణంగా దేశ కార్మికుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వివిధ సర్వేలు, అధ్యయనాలు ఆధారపూరితంగా పేర్కొన్నాయి. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాలుగు కార్మిక నియమావళులు, వాటి పాక్షిక అమలు కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మధ్యకాలంలో పలు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతనాలకు సంబంధించి వివిధ రకాలుగా డియర్‌నెస్‌ అలవె¯Œ్సలలో మార్పులను ప్రకటించాయి.

వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. దాని తర్వాతే రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతన రేటును సవరించి తగు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. 2021 జూన్‌ 4న సీఐటీయూ మిశ్రా కమిటీ నియామకం చట్టబద్ధతను ప్రశ్నిం చింది. ఈ కమిటీని వెనక్కు తీసుకోవాలని పిలుపునిచ్చింది. కనీస వేతనాలను నిర్ణయించడం విషయంపై కేంద్రం వర్గీకరణ నిబంధనలు పొందుపర్చినందున మిశ్రా కమిటీ పరిధిలో సామాజిక చర్చా ప్రక్రియకే తావు లేకుండా పోయిందని ఆరోపించింది. పైగా సాంకేతిక నిపుణులను పక్కన బెడితే మిశ్రా కమిటీ ఏర్పాటు ప్రక్రియ దానికదేగా కార్మికుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ కొట్టేటట్టు కనిపిస్తోంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మూడేళ్ల తర్వాత ఈ కమిటీ నివేదిక విడుదల అవటం అంటే కనీస వేతనాల అమలుకు ఎదురుచూస్తున్న కార్మికుల ఆకాంక్షలను నిస్పృహపర్చడమే అవుతుంది.


కేఆర్‌ శ్యామ్‌ సుందర్‌ 
వ్యాసకర్త ప్రొఫెసర్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, 
జంషెడ్‌పూర్‌ (ది వైర్‌ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top