రెండు నాల్కలు-పొల్లు మాటలు

Kommineni Srinivasa Rao Guest Column About Criticizing Chandrababu - Sakshi

ఇంతకుముందు మాట్లాడిన మాట ఇప్పుడు చెబుతున్నదాన్ని ఖండిస్తే అది చంద్రబాబు వ్యాఖ్యానం అని అర్థం చేసుకోవచ్చు. నిన్న చెప్పిందే ఇవ్వాళ్టికి రూపం మార్చుకున్నదంటే అది చంద్రబాబు ప్రవచనం అనేసుకోవచ్చు. కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఆయన పంచుకున్న మాటలు ఆ పార్టీ బలహీనపడిందని చెప్పకనే చెబుతున్నాయి; అదే సమయంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్టుగానూ ఉన్నాయి. కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోవడం ఆయన జీర్ణించుకోలేడు; అదీ వైసీపీ ప్రభుత్వ పథకాల వల్లే జనం తనకు దూరమయ్యారని ఒప్పుకోలేడు. అందుకే ఆయన మాటలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడూ సంయమనం కోల్పోయినట్టుగానూ ధ్వనిస్తున్నాయి.

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీ యంగా కలకలం రేపేవే. ఆయన తన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగ పడతాయా, లేదా? అన్నది వేరే విషయం. కానీ టీవీ చర్చలకూ, విశ్లేషణలకూ మాత్రం బాగా పనికొస్తాయి. 

జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఒక టీడీపీ కార్యకర్త అడిగి నప్పుడు ‘ఇద్దరూ ప్రేమించుకుంటే పెళ్లి వరకు వెళుతుంది. వన్‌ సైడ్‌ లవ్‌ పనికి రాదు కదా! జనసేనను మనం ప్రేమిస్తున్నాం. జనసేన కూడా కలిసి రావాలి కదా’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాతి రోజు కాస్త స్వరం మార్చి, పొత్తులు ఉన్నా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయనీ, ఒంటరిగా పోటీచేసి గెలిచిన ఎన్నికలు ఉన్నాయనీ అన్నారు. ఇది పూర్తిగా అసత్యం. టీడీపీ ఒక్క 2019లో తప్ప ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదు. 1983లో కూడా సంజయ్‌ విచార్‌ మంచ్‌ పార్టీతో ఎన్టీఆర్‌ అవగాహన కుదుర్చుకుని వారికి నాలుగు సీట్లు ఇచ్చారు. 2019లో ఒంటరిగా వెళ్లి చంద్రబాబు ఎంత ఘోరమైన ఓటమిని చవిచూశారో అందరికీ తెలుసు. 

ఆ విషయం పక్కనబెడితే కుప్పం సన్నివేశాన్ని పరిశీలించడం ఆసక్తికరం. చంద్రబాబును బీజేపీ గురించి కార్యకర్త అడగలేదు. చంద్రబాబూ ఆ ఊసెత్తలేదు. తద్వారా బీజేపీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని వారు అనుకుంటుండాలి. లేదా అప్పుడే తొందరపడ కూడదన్నా అనుకోవాలి. అదే సమయంలో నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలోని జనసేన కలిస్తే తమకు రాజకీయంగా కొంత లబ్ధి జరగవచ్చన్నది వారి ఆశ. ఎన్నికల నాటికి వీలైతే బీజేపీ, జనసేన రెండింటినీ; లేదా కనీసం జనసేనను అయినా తమవైపు ఆకర్షించడా నికి చంద్రబాబు ప్రయత్నాలు ఆరంభించారని అర్థం అవుతోంది.

బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేస్తాయనీ, వచ్చే ఎన్నికలలో గెలుస్తామనీ బీజేపీ నేతలు చెబుతుంటారు. అంతేకాదు, పవన్‌ కళ్యాణ్‌ తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వేరే పార్టీ నేతను అంత ముందుగా తమ సీఎం అభ్యర్థి అనడం ఏమిటని పలువురు బీజేపీ నేతలే   పెదవి విరిచారు. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తాము కాపులకు ప్రాధాన్యం ఇస్తామని అనడం ద్వారా ఒక సంకేతం పంపుతున్నారు. దీని సంగతి అలా ఉంచితే జనసేనపై తెలుగుదేశం పార్టీ వన్‌ సైడ్‌ లవ్‌ ప్రకటించడం వల్ల ఆ పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందా అన్నది పరిశీలించాలి. ఒంటరిగా టీడీపీ పోటీచేస్తే ఓటమి తప్పదని నాయకత్వం భావిస్తోందని కార్యకర్తలు అనుకునేలా చేస్తుంది ఈ ప్రకటన. ఏతావాతా టీడీపీ బాగా బలహీనంగా ఉందన్న సంగతి ఇట్టే అర్థం అవుతుంది.

మరో ప్రకటన చూద్దాం. కుప్పంలో వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకుంటారా అని ప్రజలపై ఆయన ఫైర్‌ అయ్యారు. టీడీపీ 22 సంవత్సరాలు అధికారంలో ఉందనీ, తాను తలుచుకుంటే ఎంతైనా డబ్బు ఇవ్వగలననీ ఆయన అన్నారట. అయితే తనకు విలువలు ముఖ్యమని చెబుతూ జనం డబ్బుకు అమ్ముడుపోయి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో స్థానిక ఎన్నికలలో టీడీపీ నేతలే కొందరు మోసం చేశారనీ, వారెవరో తనకు తెలుసుననీ, కొందరు కోవర్టులు ఉన్నారనీ ఎవరిని వదలననీ హెచ్చరించారు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా కనిపించడం లేదా? ముప్పై ఏళ్లకు పైగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, అది కూడా సీఎంగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం పదవులలో ఉన్న నేతగా కుప్పంలో పార్టీ ఎందుకు బలహీనపడిందన్నది ఆయన ఆలోచించారా? స్థానిక ఎన్నికలలో టీడీపీ కోవర్టుల వల్ల పార్టీ ఓడిపోయిందా? లేక, జనం డబ్బులు తీసుకోబట్టి ఓడిపోయిందా? ఏదో ఒకటి క్లారిటీ ఆయన తెచ్చుకోవాలి. రెండు మాటలూ ఆయనే చెప్పి ప్రజలను గందర గోళంలో పడేయడం వల్ల ఏమి ప్రయోజనం?

నిజానికి సీఎం జగన్‌ అమలు చేసిన వివిధ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు టీడీపీని ఓడించి, వైసీపీకి పట్టం కట్టారన్న వాస్తవం చెప్పలేని దైన్య స్థితి చంద్రబాబుది. అసలు ఉమ్మడి ఏపీలో ఎన్నిక లలో భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేయడం అలవాటు చేసిందే చంద్ర బాబు! ఈ విషయాన్ని పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటారే. ఒక సందర్భంలో అత్తిలి ఉప ఎన్నికలో పోటీ చేసిన దివంగత టీడీపీ నేత దండు శివరామరాజు నాతోనే అన్నారు. ‘ఏమి డబ్బురా చంద్రబాబు... ఉప ఎన్నికలో బాబు అంత డబ్బు పంపుతా రని నేను ఊహించలేదు. ఇలాగైతే జనరల్‌ ఎన్నికలలో ఎంత ఖర్చు పెట్టగలను!’ అని ఆయన ఆశ్చర్యపోయారు. విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తాను తలుచుకుంటే ఎంత డబ్బయినా పెట్ట గలనని ఎలా అంటారు? నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఓటుకు ఐదువేలైనా ఇవ్వగలనని అన్నట్లుగానే ఈ మాటలు ఉన్నాయి కదా! 

ఇక్కడ మరో విశేషం ఉంది. కుప్పంలో అన్ని స్థానిక ఎన్నికలలో ఓటమికి ప్రజలను తప్పు పట్టిన చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఆయన ఆ ఓటమితో తన పరువు పోయిందని అంగీకరించారని స్పష్టం అవుతుంది. కుప్పంలో ఓడిపోతే రాష్ట్రం అంతా టీడీపీ ఓడిపోయినట్లు అవుతుందని ఆయన చెప్పడం కాస్త  వాస్తవానికి దగ్గరగానే ఉంది. ఈ సందర్భంగా పార్టీలో యువకులు ఎందుకు చేరడం లేదనీ, ఎప్పుడూ పాత ముఖాలే కనిపిస్తున్నాయనీ అన్నారట. తద్వారా పార్టీ జవసత్వాలు కోల్పోవ డానికి ఇది కూడా కారణమని ఆయన అంగీకరించారు. పార్టీ సీనియర్‌ నేతలు సరిగా పనిచేయలేదని ఆయన ఆక్షేపించారు. తన పాలనను వైసీపీ పాలనతో పోల్చుకుని, జనం టీడీపీకి ఓట్లు వేయలేదని నేరుగా చెప్పలేరు కదా? ఈ సందర్భంలో ఆయన చేసిన వలంటీర్ల ప్రస్తావనను కూడా పరిశీలించాలి.

ఒకప్పుడు ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం వేళ ఇళ్లలో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వలంటీర్లు తలుపులు కొడతారనడం, ఇవేం ఉద్యోగాలు... మూటలు మోసే పని అనడం తీవ్ర నిరసనకు గురయ్యాయి. ఎప్పటి మాదిరి ఇక్కడ కూడా ఆయన మాట మార్చారు. ప్రతి వంద ఓటర్లకు సేవామిత్రలను టీడీపీ నియ మిస్తుందనీ, ప్రభుత్వం వచ్చాక వారంతా వలంటీర్లు అవుతారనీ ఆయన అనడం చూస్తే... ఒకవేళ తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినట్లు అర్థమవుతుంది. 

మరో ప్రకటన కూడా ఉంది. తమ పార్టీ కార్యకర్తలను వైసీపీ నాయకులు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనీ, తాను రెండేళ్లలో అధికారంలోకి వస్తాననీ, అప్పుడు ఇరవై రెట్లు ఎక్కువగా హింసిస్తాననీ హెచ్చరించారట. ఇలా ఎవరైనా చెప్పవచ్చా? ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులమడం, రాష్ట్రం అంతా ఏదో అయిపోయిందని ప్రచారం చేయడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా? తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజీగా ఉండవచ్చు. టీడీపీ అధినేతగా కొన్ని పనులు ఉండవచ్చు. కానీ మూడు నెలలకు ఒకసారి వస్తానని చెప్పడం అంటే ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నట్లా, లేనట్లా? కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానని గతంలో చెప్పిన మాట ఏమైనట్లు? చదవేస్తే ఉన్న మతి పోయిందని ఒక సామెత. చంద్ర బాబు నాయుడు కూడా ఇప్పుడు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తే... అది ప్రజలను మభ్య పెట్టడానికి అయినా కావాలి... లేదా సంయమనం కోల్పోవడం వల్ల అయినా కావాలి. ఎవరికి కావాల్సి నట్లుగా వారు ఊహించుకోవచ్చు.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top