Rajiv Gandhi Assassination: రాజీవ్‌ గాంధీ హత్య.. ఆ రోజు ఏం జరిగిందంటే..?

Jilla Govardhan‌ Article On Rajiv Gandhi Death - Sakshi

సందర్భం

అది 1991 మే 21. సమయం రాత్రి 10.30. కొత్త ఢిల్లీలోని 10– జనపథ్‌ రోడ్‌లో ఉన్న మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ పర్సనల్‌ సెక్రెటరీ వి. జార్జ్‌ రూమ్‌లో టెలిఫోన్‌ ఆగకుండా మోగుతోంది. జార్జ్‌ రిసీవర్‌ ఎత్తి హలో అనగానే, అటు నుండి ‘దిస్‌ ఈస్‌ సీఐడీ ఆఫీసర్‌ ఫ్రమ్‌ చెన్నై సర్‌. మేడం (సోనియా గాంధీ)తో మాట్లాడాలండీ‘ అని ఆదుర్దాగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్‌ సిక్స్త్‌ సెన్స్‌ శంకించింది. ‘బాస్‌ (రాజీవ్‌) ఎలా ఉన్నారు?’ వణకుతున్న గొంతుతో జార్జ్‌ ప్రశ్న. ‘సర్‌ మేడంకి ఇవ్వండి ఫోన్‌’ అటునుండి అర్థింపు. ‘నేను అడుగుతుంది బాస్‌ ఎలా ఉన్నాడు అని’... ఈ సారి కటువుగానే అడిగాడు పీఏ జార్జ్‌. ‘సర్‌... హి ఈస్‌ నో మోర్‌...’ అంతే... లైన్‌ డిస్‌ కనెక్ట్‌ అయింది.
చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు

ఆ రోజు ఉదయం (21.5.1991) నుండి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు? ఒరిస్సాలో ఎన్నికల సభల్లో మాట్లాడి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సర్క్యూట్‌ హౌజ్‌ చేరుకున్నారు. పదవ లోక్‌సభ (1991) ఎన్నికలకు 40 శాతం సీట్లను ఆయన యువతకే కేటా యించారు. అందులో వైజాగ్‌ లోక్‌సభ కాండిడేట్, 38 సంవత్సరాల ఉమా గజపతి రాజు కూడా ఒకరు. ఆమె కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడే ఢిల్లీ నుండి సోనియా ఫోన్‌! వెంటనే బయల్దేరి ఢిల్లీకి వచ్చేయమని ఆమె కోరింది. ‘మరగతం (చంద్రశేఖర్‌) ఆంటీ... మమ్మీ (ఇందిరాజీ) క్లోజ్‌ ఫ్రెండ్‌. ఈ రాత్రి ఆమె సభను (శ్రీపెరుం బుదూర్‌) అడ్రస్‌ చేసి రేపు ఉదయం ఫస్ట్‌ ఫ్లైట్‌కి ఇంటికి చేరుకుంటాను’ అన్నారు రాజీవ్‌. ఫోన్‌ పెట్టేశారు సోనియా. తమ ఇంట్లో డిన్నర్‌ చేసి వెళ్లమన్నారు ఉమ. ‘నో ఉమా, లెట్‌ మీ మూవ్‌’ (మృత్యువు పిలుపు కాబోలు) అంటూ, మందహాసంగా ఆమె రిక్వెస్ట్‌ను తోసిపుచ్చారు బాస్‌.

తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌ సభా ప్రాంగణం ఆ రాత్రి ఫ్లడ్‌ లైట్ల కాంతిలో, కాంగ్రెస్‌ కార్యకర్తలు, క్రిక్కిరిసిన శ్రోతలతో పండగ వాతావరణం సంతరించుకుంది. లౌడ్‌ స్పీకర్లలో తమిళ తల్లిని కీర్తిస్తూ పాటలు! మరో వైపు రంగు రంగుల పూలతో అలంకరించిన అతి పెద్ద వేదిక మీద తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కురుపయ్య మూపనార్, ఇతర నాయకులూ; పార్టీ అభ్యర్థీ, సీనియర్‌ నాయకురాలూ అయిన మరగతం చంద్రశేఖర్‌ వంటివారు ఉత్సాహంగా రాజీవ్‌గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు.

చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్‌ ప్రాంతం చుట్టుముట్టు తమిళ ఉగ్రవాదుల ‘స్లీపర్‌ సెల్స్‌’ మాటేసి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి. ‘లిబరే షన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం’ (ఎల్‌టీటీఈ) హిట్‌ లిస్ట్‌లో ఉన్న మొదటి ఇండియన్‌ లీడర్‌ రాజీవ్‌ గాంధీ! రాత్రి వేళల్లో తమిళనాడులో ఓపెన్‌ మీటింగులకు ఆయన రావటం రిస్కుతో కూడుకున్న పని అని పోలీసు నిఘావర్గం అప్పటికే తెలిపింది. అయినా రాత్రి 9 గంటలకు ఈ సభలో ప్రసంగించాలని బయలు దేరారు రాజీవ్‌. విధిలీల!

సభా ద్వారం నుండి ఎర్ర తివాచీపై నడుస్తూ... నవ్వుకుంటూ అభిమానుల చేతులు కలుపుతూ ఒక్కొక్క అడుగే వేస్తున్నారు. జనసమూహం నుండి ఆతన్ని వేరు చేయటానికి స్థానిక పోలీసులు, ఆయన పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ప్రదీప్‌ గుప్తా శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పంజాబీ డ్రస్‌ ధరించి కళ్లజోడు పెట్టుకున్న 16 ఏళ్ల చామన చాయ యువతి, చందనపు దండ పట్టుకుని రాజీవ్‌కు ఎదురుగా ప్రత్యక్షమైంది. నవ్వుతూ ఆయన మెడలో ఆ దండ వేసింది. ఆమెను వారిస్తూ ఒక వైపు తోసే ప్రయత్నం చేసింది లేడీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌.

ఆమెను చూసి చిరునవ్వుతో ‘రిలాక్స్‌ బేబీ’ అని అపారాయన. అదే అదునుగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్టు ముందుకు వంగింది ఆ అమ్మాయి (థాను). అంతే...! చెవులు చిల్లులు పడే శబ్దంతో బాంబు పేలటం, రెప్పపాటులోనే రాజీవ్‌ గాంధీ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోవటం జరిగిపోయింది. ఈ భీకర సంఘటన అప్పటి దేశ రాజకీయ చదరంగంలో అతి పెద్ద మలుపునకు దారితీసింది. 48 సంవత్సరాల కాంగ్రెస్‌ యువనేత రాజీవ్‌ గాంధీకి బదులు 68 సంవత్సరాల దక్షిణాది తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని పీఠం అధిరోహించారు.
(రషీద్‌ కిద్వాయి గ్రంథం ‘24 అక్బర్‌ రోడ్‌’ ఆధారంగా...)


- జిల్లా గోవర్ధన్‌

వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్‌ కమిషనర్‌ 
(మే 21న
రాజీవ్‌ గాంధీ వర్థంతి) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top