గౌతమ్‌ గంభీర్ (ఢిల్లీ ఎం.పి.).. రాయని డైరీ

Gautham Gambhir Rayani Dairy By Madhav Singaraju - Sakshi

మాధవ్‌ శింగరాజు

పదేళ్ల క్రితం అందరం పదేళ్లు చిన్నవాళ్లం. వరల్డ్‌ కప్‌ గెలిచాం! మా కెప్టెన్‌ ధోనీ. ధోనీలో నాకెప్పుడూ ఒక గొప్పతనం కనిపిస్తుంది. ప్రతి గెలుపులోనూ అతడొక్కడే మనందరికీ కనిపిస్తున్నా.. ‘ఇదిగో నేనిక్కడ ఉన్నాను’ అంటూ అతడెక్కడా మనకు కనిపించడు! ఆ రోజు వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ ఫొటోలో కూడా ధోనీ ఎత్తిపట్టిన కప్పు కనిపించింది తప్ప, ధోనీ కనిపించలేదు. మరి మనం ఎందుకు కప్పు గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా కప్పుని కాకుండా అతడిని ఎత్తిపట్టి చూపిస్తున్నాం?! అతడికి నచ్చే విషయమేనా? చేతులు కట్టుకుని దూరంగా చిరు దరహాసంతో తన టీమ్‌ సంబరాలను పదేళ్లుగా చూస్తూ నిలబడి ఉన్న కెప్టెన్‌ దగ్గరకు వెళ్లి, ‘నేటికి పదేళ్లు’ అని గుర్తు చేసి, అతడి చేతిని బలవంతంగా పైకెత్తించి, ఆ చేతిలోని రెండు వేళ్లను ‘వి’ షేప్‌లో బలవంతంగా తెరిపించి.. ఏమిటిదంతా! నాయకుడి ఆత్మ టీమ్‌లో ఉంటుంది. టీమ్‌ ఆ ఆత్మకు తిరిగి నాయకుడి రూపం ఇవ్వడం అంటే అతడి పెద్దరికాన్ని అతడికి కాకుండా లాగేయడమే.  

వరల్డ్‌ కప్‌ విజయంలో ప్లేయర్స్‌కి మాత్రమే కాదు.. ప్రతి రన్‌కి, ప్రతి బంతికి భాగస్వామ్యం ఉంది. రన్‌ అవుట్‌కి, మిస్‌ అయిన క్యాచ్‌కి కూడా గెలుపులో షేర్‌ ఉంది. పదేళ్ల క్రితం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచింది. అదీ ఆ రోజు ఫైనల్స్‌లో ఇండియా సాధించిన అసలు విజయం. దాని గురించి చెప్పుకోవాలి. లేదంటే, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ టీమ్‌లోని వాళ్లంతా ఏం చేస్తున్నారో చెప్పుకోవడం కూడా ఆ రోజు సాధించిన విజయం గురించి చెప్పుకోవడమే అవుతుంది. అది మంచి సంగతి కదా! ధోనీ ఇప్పుడు చికెన్‌ ఫామింగ్‌ చేస్తున్నాడు. క్రి కెట్‌ మానేశాడని కాదు. ఆడుతున్నాడు. ఆటెప్పుడూ ఆటగాడిని వదిలేసిపోదు. సచిన్‌ రిటైర్‌ అయ్యాడని ఆట అతడిని ఏ రోజైనా ‘ఏయ్‌ రిటైర్డ్‌ మ్యాన్‌’ అనిందా? లేదు. ఈమధ్యే రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడొచ్చాడు. ఈ పదేళ్లలో సెహ్వాగ్‌ కామెంటేటర్‌ అయ్యాడు. ట్విట్టర్‌లోనే ఎప్పుడూ అతడు కనిపించడం! కోహ్లీ వరల్డ్‌కప్‌లో బేబీ బాయ్‌. ఇప్పుడొక బేబీ గర్ల్‌కి ఫాదర్‌. యువరాజ్‌ పదేళ్ల క్రితం మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌. తర్వాత క్యాన్సర్‌తో ఫైట్‌. ధైర్యంగా ఆడాడు. గట్టిగా నిలబడ్డాడు. గ్రేట్‌. రైనా ఆనాటి స్క్వాడ్‌లో యంగ్‌మ్యాన్‌. స్టార్‌లు ఆడుతుంటే తను ఆడే చాన్స్‌ కోసం చూశాడు.

కప్పొచ్చిన టీమ్‌లో ఉన్నాడు కానీ, కప్పు విజయాన్ని ఒక చెయ్యేసి పట్టుకునే చాన్సే రాలేదు. ఇప్పుడతడు చెన్నై సూపర్‌ కింగ్‌. పఠాన్‌ ఆల్‌ రౌండర్‌. వరల్డ్‌ కప్పులో పెద్దగా బ్యాటింగ్‌ చేయలేదు. సచిన్‌లా అతడూ ఇప్పుడు కరోనాపై ఆడుతున్నాడు. హర్బజన్‌ కెరీర్‌ చివరికొచ్చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్‌ అతడిప్పుడు. జహీర్‌ ముంబై ఇండియన్స్‌కి క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌. పటేల్‌ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నెహ్రా కామెంటరీలు చెబుతున్నాడు. ఈ మధ్యే ఢిల్లీ నుంచి గోవా షిఫ్ట్‌ అయ్యాడు.. నేనిప్పుడు ఢిల్లీ నుంచి బెంగాల్‌ షిఫ్ట్‌ అయినట్లు! కొన్ని రోజులుగా ఇక్కడే నా మకాం. బెంగాల్‌లో ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించాలని అమిత్‌షా! ‘‘అమిత్‌జీ అలా వద్దు. బీజేపీని గెలిపించుకుందాం’’ అని చెప్పి క్యాంపెయిన్‌ కోసం బెంగాల్‌ వచ్చాను. ‘‘ఆ రోజు ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఓపెనర్‌గా నువ్వు తొంభై ఏడు రన్స్‌ తీసి శ్రీలంక మీద ఇండియా గెలవడానికి కారణం అయినట్లే.. తృణమూల్‌ మీద బీజేపీ జట్టును గెలిపించి మంచి ఓపెనింగ్‌ ఇవ్వాలి గౌతమ్‌’’ అంటున్నారు అమిత్‌షా!

అశ్విన్, పీయుష్, శ్రీశాంత్‌.. వరల్డ్‌ కప్పులో ఆడిన మిగతా ప్లేయర్స్‌. అశ్విన్‌ ప్రస్తుతం ఫామ్‌లోనే ఉన్నాడు. పీయుష్‌ గుజరాత్‌ వెళ్లిపోయాడు. శ్రీశాంత్‌ బ్యాన్‌ నుంచి బయట పడ్డాడు. జీవితంలోనైనా, ఆటలోనైనా కలిసి ఆడిన ఆటలోని గెలుపు ఓటములకు ఏ ఒక్కరో కారణం అయి ఉండరు. వరల్డ్‌ కప్పు విజయంలోనూ అంతే.   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top