నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే! | Sakshi
Sakshi News home page

నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే!

Published Sat, Jan 21 2023 1:46 PM

Cash Transfer Scheme is Good for The Economy: Maka Rajendran - Sakshi

ఏపీలో ఇప్పుడున్న పాలక పక్షానికి (వైఎస్సార్‌సీపీ) గత మూడున్నర ఏళ్ల క్రితం ఎకాఎకిన 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం – నూతన పరి పాలనా సంస్కరణలతో, తాను చేసిన వాగ్దానాల మేరకు... సంక్షేమ పథకాలు, ఉద్యోగకల్పన, పరిపాలనా వికేంద్రీ కరణతో శరవేగంగా దూసుకపోతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లోకెల్లా బాగా ప్రాచుర్యం పొందినవి రెండు – ఒకటి యువతకు భారీ ఉద్యోగ కల్పన. రెండు – నగదు బదిలీ పథకం. 

నగదు బదిలీ పథకం విషయంలో ‘పేదల్ని కూర్చోబెట్టి పోషిస్తున్నా’ రంటూ అనేకమంది అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు చేస్తున్న ఈ నగదు బదిలీ వల్ల ఖజానాకు ఒక్క పైసా నష్టం రాకపోగా; నగదు బదిలీ జరిగిన మరుసటి వారంలోపే దానిలో అత్యధిక భాగం తిరిగి చిల్లర వ్యాపారులకు – తద్వారా రాష్ట్ర ఖజానాకే చేరుతుంది ఆ డబ్బంతా! ఈ ద్రవ్య సంచయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు కొత్తగా తెలిసిందేమంటే – ఇంత భారీగా ప్రజ లకు ఇవ్వగలిగిన సొమ్ము – ఇప్పటి వరకు గత పాలకులు తమకు దక్కకుండా చేశారనే విషయం.

ఇక ఉద్యోగ కల్పన విషయానికి వస్తే... గత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా; ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేసి, దళారీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచాయి. ఇంతే కాదు, ఇలాంటి అస్థిర ఉద్యోగాల వల్ల అటువంటి ఉద్యో గులు – ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఉద్యోగాలతో రాజీ పడలేక, నాణ్యమైన సేవలు అందించలేక అస్థిర జీవనం కొనసాగించే వారు. అలాంటి తరుణంలో – వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ఉదార ఉద్యోగ కల్పన వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నిండింది.

ఈ ఉద్యోగాల కల్పన వల్ల యువతకు సుస్థిర జీవనం సాగించే అవకాశంతో పాటు; తమ మీద తమకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వీరికిచ్చే జీతాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందన్న ప్రతిపక్షాల చీకటి ప్రచారాలు కూడా సరైన వాదనకు నిలబడేవి కావు. కారణం – ఇన్ని లక్షల మందికి చెల్లించే వందల కోట్ల జీతాల మొత్తాలు మరుసటి రోజే మార్కెట్‌లోకి వెళ్ళి పోతున్నాయి ఖర్చుల రూపంలో. ఖర్చులోనే ఆదాయ ముంటుందన్న ఆర్థిక సూత్రం మేరకు మళ్ళీ వీరి ఖర్చు ప్రభుత్వ ఖజానాలకు ఆదాయంగా మారుతోంది. అందువల్ల వీరి జీతాలను ఖర్చుగా భావించనక్కర్లేదు. పై పెచ్చు ఈ భారీ ఉద్యోగిత వల్ల పాలనా, సేవా సౌకర్యాలు అత్యంత సామాన్యుని ఇంటి ముంగిట వరకు చేరటంతో – పౌర సమాజానికి సమయం, డబ్బు ఆదా అవుతోంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత నిచ్చి, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చదువుకొనే విద్యార్థులకు అనేక ఫీజు రాయితీలు కల్పిస్తూ; ప్రభుత్వ రంగ విద్యా సంస్థ ల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవటం వల్ల... సమీప భవిష్యత్తులో నాణ్యమైన ప్రమాణాలు కల విద్యార్థి సమూహం సమాజంలోకి ధీమాగా అడుగు పెడుతుంది. 

ఇక వైద్య రంగాన్ని గమనిస్తే – వైద్య, ఆరోగ్య రంగాలలో భారీ ఉద్యోగితను కల్పించటం; ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సంస్థలను అభివృద్ధి పరచడం... తద్వారా అందని ద్రాక్షగా తయారైన వైద్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చినట్టయింది. 

రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఫలితంగా మిగిలిన అప్పులూ... వెరసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను భారం చేశాయి.   

అంతకు ముందు ఐదేళ్లల్లో ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఎడాపెడా రాష్ట్రమంతటా రోడ్లు వేయించ పూనుకున్నాడు. వేగుల ద్వారా – ప్రభుత్వంపై ఉన్న తారాస్థాయి అసంతృప్తి సమాచారాన్ని తెలుసుకొన్న తాను దోమలపై దండయాత్ర అంటూ, పంచాయితీలకు ఎన్నికల సంవత్సరం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చాడు. ఈ ‘ఆఖరు క్షణం ఖర్చుల’ వల్ల రాష్ట్రానికి మూడు విధాల నష్టం వాటిల్లింది.

కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో చేతులు కలిపి భారీగా అవినీతికి పాల్పడటం మొదటిది కాగా; ఈ అవినీతి వల్ల పనుల్లో నాణ్యత తగ్గటం రెండోది. ఈ పర్యవసానాల వల్ల రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ అవ్వడం మూడోది. ఫలితంగా జగన్‌ తన పాలనను ‘మైనస్‌ జీరో బడ్జెట్‌’ నుండి మొదలు పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే – అప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పు – 2 లక్షల 64 వేల, 451 కోట్లు కాగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ కావటం వల్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి తొలిరోజు నుండే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కనీసంగా వెయ్యి కోట్ల రూపాయిలు వడ్డీ ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా పేదల కోసం మొద లెట్టిన నగదు బదిలీ పథకం అప్రతిహతంగా కొనసాగించే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే! (క్లిక్ చేయండి: ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?)


- మాకా రాజేంద్రన్‌ 
సామాజిక విశ్లేషకుడు

Advertisement
 
Advertisement
 
Advertisement