కులగణనకు... భయమెందుకు?

BC Leader R Krishnaiah Guest Columns Over Caste Census India - Sakshi

విశ్లేషణ

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారు చేసిన జనగణనలో దేశంలో సమారు నాలుగు వేల కులాలు ఉన్నట్లు తేలింది. తర్వాత జరిగిన సర్వేలు ఈ సంఖ్యను ఆరు వేలుగా తేల్చాయి. అయితే నలభై ఆరు లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయనీ, వీరిని లెక్కించడం సంక్లిష్టమైన ప్రక్రియ అనీ కేంద్రం వాదిస్తోంది. పైగా కులతత్వం పెరుగుతుందని చెబుతోంది. కులం పునాదుల మీద నిర్మాణమైన భారత సమాజంలో కులం ఏమిటో తెలిస్తే కులతత్వం పెరుగుతుందనడం అసంబద్ధ వాదన. కులాల వారీ జనగణన బీసీల అభివృద్ధికి అత్యవశ్యం. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందడం వారి హక్కు. ఈ లెక్కలు తేలితే చిక్కులు వస్తాయనే భయంతోనే కేంద్రం దీనికి నిరాకరిస్తోంది.

జనాభా గణనలో ‘కులగణన’ చేపట్టాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్‌ ముఖ్య మంత్రులు అసెంబ్లీలలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. బీఎస్పీ అధినేత మాయావతి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సహా అన్ని జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా ప్రకటనలు జారీ చేశాయి.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహా రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ– కులగణన సంక్లిష్టమైన ప్రక్రియ అనీ, ఆచరణలో సాధ్యం కాదనీ వితండవాదం చేస్తోంది. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు/ఉప కులాల పేర్లు ప్రజలు చెప్పారని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్‌ వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలు ఉన్నట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే 46 లక్షల కులాలు/ ఉపకులాల వాదన సరికాదు. ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,642 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో 2,892 బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్ర కులాలు అన్నీ కలిసినా ఆరు వేలకు మించవు. గతంలో అనేక సర్వే లలో కూడా దేశంలో 6 వేల కులాలు ఉన్నాయని తేల్చారు.

జనాభా గణనలో కులగణన చేపట్టాలని 2010లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్‌ చేసింది. 2018 ఆగస్టు 31న అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ దఫా జరిగే జనగణనలో కులాల వారీ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తు న్నట్లు? 1953లో నియమించిన కాక కాలేల్కర్‌ కమిషన్, 1979లో నియమించిన మండల్‌ కమిషన్‌ కులగణన చేయాలని కేంద్రానికి సిఫారసు చేశాయి. వివిధ రాష్ట్రాలలో నియమించిన మొత్తం 246 బీసీ కమిషన్లు కూడా దాన్నే సిఫారసు చేశాయి. రిజర్వేషన్ల కేసులు వచ్చిన ప్రతిసారీ సుప్రీంకోర్టు, హైకోర్టులు కులగణన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాయి. జనాభా గణన పట్టికలో 35 కాలమ్స్‌ ఉన్నాయి. ఇంకో కాలమ్‌ పెడితే నష్టమేమిటి? ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల వివరాలన్నీ వస్తాయి కదా.

కులగణన చేపడితే హిందువుల ఓట్లలో చీలిక వస్తుందని బీజేపీ భయపడుతోంది. ఇది అర్థం లేని వాదన. కుల ప్రస్తావన లేకుండా రోజువారీ వ్యవహారాలు జరగడం లేదు. కులం పునాదుల మీదనే భారతీయ సమాజం నిర్మాణం జరిగింది. కాబట్టి ఒక్కరోజు కులం ఏమిటో అడిగితే కులతత్వం పెరుగుతుందన్నది ఊహాజనితమైన ఆలోచన. కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతోంది ప్రభుత్వం. మరి 1881 నుంచి 1931 వరకు బ్రిటిషు వారి హయంలో 6 సార్లు కుల జనగణన చేయలేదా! ప్రతి కుల గణనలో మతపరమైన, భాషా పరమైన వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలను లెక్కిస్తు న్నారు. ఇవన్నీ చేసినప్పుడు జరగని ఘర్షణలు బీసీల సమాచారం సేకరిస్తే జరుగుతాయనడం అహేతుకం. అణచివేతకు గురైన కులాలు అన్ని రంగాలలోనూ– విద్య, ఉపాధి, చట్ట సభలతో సహా– తమ జనాభా ప్రకారం రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తారేమో అని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తుంది.

ఎస్సీ, ఎస్టీలకు కులగణన జరుగుతున్నందున వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేశారు. బడ్జెట్‌ కేటాయిం పులు జరుగుతున్నాయి. కానీ బీసీ కులాల లెక్కలు లేనందున జనాభా ప్రకారం రిజర్వేషన్లు పొందడం లేదు. సబ్‌ ప్లాన్‌ లేదు. బీసీల జనాభా 56 శాతం ఉంటే కేవలం 25 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. కులాల వారీ లెక్కలు లేనప్పటికీ బ్రిటిష్‌ వారు 1931లో తీసిన జనాభా గణన ఆధారంగా బీసీలు మన రాష్ట్రంలో గత 47 సంవత్స రాలుగా అనంతరామన్‌ కమిషన్‌ రిపోర్టు ప్రకారం 25 శాతం రిజర్వే షన్లు పొందుతున్నారు. కేంద్రంలో మండల్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం 29 సంవత్సరాల నుంచి ఉద్యోగ, విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ కాలంలో ఏయే కులాలు రిజ ర్వేషన్ల ఫలాలు పొందాయి, ఇంకా రిజర్వేషన్‌ ఫలాలు పొందని కులాలు ఏవి అనే వివరాలకు కులాల వారీ లెక్కలు అవసరం. రిజ ర్వేషన్‌ వలన లాభం పొందిన కులాలు, పొందని కులాల వివరాలు తెలిస్తే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంటుంది.

కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపు లుగా వర్గీకరణ చేయలేదు. ఈ బీసీ కులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వీటి వర్గీకరణ జరగాలంటే ప్రతికులం జనాభా తెలియాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేసిన పిదప కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నాలుగేళ్ల క్రితం జస్టిస్‌ రోహిణి కమిషన్‌ను నియమించింది. కుల వివరాలు లేకపోవడంతో, జనాభా శాతం తెలియక ఆయా గ్రూపుల శాతం నిర్ణయించలేక కమి షన్‌ తుది రిపోర్టు ఇవ్వలేకపోతోంది. కుల గణన వివరాలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి కమిషన్‌ ఆరు లేఖలు రాసింది. 

బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు గత 34 ఏళ్లుగా అమలుచేస్తున్నారు. చట్టబద్ధమైన కులగణన వివరాలు లేక తాత్కా లికంగా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి, లేదా లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారు. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటా యించాలనే విషయంలో సరైన లెక్కలు లేక కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదు రవుతున్నాయి. కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్, రాష్ట్రాలలో బీసీ కార్పొరేషన్‌తో పాటు ఆయా కులాలకోసం ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ జనాభా వివరాలు లేక ఎంత బడ్జెట్‌ కేటాయించాలనే విషయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఒకసారి కులగణన చేస్తే 74 ఏళ్ల స్వతంత్ర భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం బయటకు వస్తుంది. స్వాతంత్య్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏయే కులాలు ఎంత శాతం పొందా యనే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజకీయ, ఉద్యోగ, విద్యా, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఏయే కులాలకు ఎంత ప్రాతినిధ్యం ఉంది; ఎవరి ఆధీనంలో పరిశ్రమలు, ఆస్తులు, దేశ సంపద కేంద్రీ కృతమై ఉంది; ఇంతవరకు ఈ రంగాలలో అసలు ప్రాతినిధ్యం లేని కులాలు ఎన్ని అనేది గుర్తించి వాటిని ఎలా పైకి తేవాలనే పథకాలు రూపొందించడానికి కులాల వారీ జనగణన ఉపయోగపడుతుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కులాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం, భూముల కేటాయింపు, కులవృత్తులు, చేతివృత్తుల వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నాయి. కులగణన ఉంటే జనాభా ప్రకారం వీరికి ఎంత శాతం కేటాయించాలనే శాస్త్రీయమైన ఆధారాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన సౌలభ్యం కోసం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి ఫలాలు అందరికీ అంద జేయడం కోసం కులగణన అవరసరం. ఈ వాస్తవాలను గుర్తించ కుండా కులతత్వం పెరుగుతుందనే సాకుతో, జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా అడుగుతారనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం కులాల వారీ జనగణనకు అంగీకరించడం లేదనేది బహిరంగ రహస్యం.

ఆర్‌. కృష్ణయ్య 
వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మొబైల్‌: 90000 09164
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top