డెలివరీ గర్ల్స్‌

Womens starts Food Delivery In Hyderabad - Sakshi

ఫుడ్‌ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్‌ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్‌ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్‌ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది.

రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్‌ డెలివరీని ‘ఎనీ టైమ్‌’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్‌ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మొట్టమొదటి డెలివరీ గర్ల్‌
కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్‌ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్‌ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఫుడ్‌ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్‌ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్‌ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్‌ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది.

ఇ–కామర్స్‌ కంపెనీలకు డెలివరీ సేవలు..
దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్‌దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్‌ డ్రైవింగ్, సెల్ఫ్‌ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు.

మిల్క్‌ ఉమెన్‌
ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్‌ మెన్‌ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్‌  నిర్వాహకులు.
‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు.

కష్టం నేర్పిన పాఠం
కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్‌లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవడానికి హైదరాబాద్‌ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్‌ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది.

మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు
ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్‌ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం.
– కిషోర్‌ ఇందుకూరి, సిథ్స్‌ ఫార్మ్‌ డైరీ

– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top